Jun 30,2023 21:22

సమావేశంలో మాట్లాడుతున్న శివకుమార్‌

కడప అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఎంపిక పరీక్షలు నిర్వహించాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 నెలలు గడిచిపోయినా ఇప్పటిదాకా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఈవెంట్స్‌ నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీ పోస్టుల భర్తీ కోసం డిఎస్‌సి గ్రూప్‌-2 సచివాలయల పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.36 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను తీవ్రమైన నిరాశకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసు 62 ఏళ్లు పెంచి రాష్ట్రంలో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను మరింత దూరం చేశారని విమర్శించారు. తక్షణమే ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఈవెంట్స్‌ కండక్ట్‌ చేయకపోతే జులై 3వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సచివాలయ వ్యవస్థలో పశుసంవర్ధక శాఖలో క్లస్టర్‌ విధానాన్ని తీసుకువచ్చి ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నా వాళ్లకు నిరాశ మిగిలిచారని తెలిపారు. తక్షణమే క్లస్టర్‌ విధానాన్ని రద్దు చేసి యధావిధిగా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. డిఎస్‌సి గ్రూప్‌ టు ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు,జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్‌ రాజ్‌ పాల్గొన్నారు.