కాంటూరుతో సంబంధం లేకుండా ముంపు గ్రామాలన్నింటినీ ఆర్ఆర్ కింద గుర్తించాలి
ప్రజాశక్తి- కూనవరం
కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా ముంపు గ్రామాలన్నింటినీ ఆర్ అండ్ ఆర్ గ్రామాలుగా గుర్తించాలని సిపిఎం ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ డిమాండ్ చేశారు. స్థానిక మార్త శ్రీరామ్మూర్తి భవన్‌లో వైస్ ఎంపిపి కొమరం పెంటయ్య అధ్యక్షతన జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో కిరణ్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్, ముంపు ప్రజల పట్ల నిర్లక్ష్య దోరణితో ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వ్యవహరించి ముంపు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ రకంగా మాట్లాడడం ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు. జులై నెలలో వచ్చిన వరదలకు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ముంపునకు గురైతే 41.5 కాంటూరులో ఉన్న గ్రామాలను మాత్రమే ఆర్ అండ్ ఆర్‌లోకి తీసుకోవడం విడ్డురంగా ఉందన్నారు. తక్షణమే కాంటూరుతో సంబంధం లేకుండా ముంపునకు గురైన ప్రతి గ్రామాన్ని ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ముంపు గ్రామాల ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, నాయకులు పాయం సత్యనారాయణ, బొగ్గా రామారావు, బాబు బొర్రయ్య, తెల్లం తమ్మయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు, తలగాని నాగరాజు, జ్యోతి, రామారావు తదితరులు పాల్గొన్నారు.










