Jul 30,2023 21:42

ప్రజాశక్తి - ఉంగుటూరు
         కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, 72 షెడ్యూల్డు రంగాలకు సంబంధించిన వేతన సవరణ వెంటనే చేపట్టాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఉంగుటూరులో జరిగిన సిఐటియు జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు అధ్యక్షతన జరిగింది. డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యోగులను, అసంఘటితరంగ కార్మికులను, స్కీం వర్కర్లను, సమన్వయం చేస్తూ కార్మికవర్గాన్ని ఐక్యం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లు 2022ను, కార్మిక వర్గం అంతా అడ్డుకోవాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆశా, అంగన్‌వాడి, మధ్యాహ్న భోజన పథకం, స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. అసంఘటిత రంగంలో బిల్డింగ్‌ వర్కర్లకు ఉన్న వెల్ఫేర్‌ బోర్డును పునరుద్ధరించాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పారిశుధ్య కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న వారిని, కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ పేరిట ఉన్న కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న వలస కార్మికులకు రక్షణ కల్పించాలని, చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లు, రైల్వే ప్రయివేటీకరణను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సిఎం జగన్‌ తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, ప్రత్యేక హోదా వంటి ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టుపెట్టారని విమర్శించారు. కార్మికవర్గం ఎన్నో పోరాటాలతో సాధించుకున్న చట్టాలను కేంద్రప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మార్చి కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మారుస్తోందని, దీన్ని కార్మిక, ఉద్యోగ, శ్రామికవర్గం అంతా కలిసికట్టుగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్మికవర్గ ప్రయోజనాలే ప్రాధాన్యతగా సిఐటియు ముందుకెళుతుందని, సమరశీల పోరాటాలకు కార్మికవర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శ్రామిక మహిళ నాయకులు కె.విజయలక్ష్మి, ఎం.నాగమణి, ఎస్‌కె.సుభాషిణి, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.పోచమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య, కె.వెంకట్రావు, ఎస్‌.రాంబాబు, కెవికెఎస్‌.ప్రసాద్‌, ఆటో యూనియన్‌ జిల్లా కార్యదర్శి జె.గోపి నాయకత్వం వహించారు.