Dec 15,2022 22:47

పీడీఎఫ్‌ ఎంఎల్‌సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లురెడ్డి

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి
ప్రజాశక్తి-నాయుడుపేట

పాదయాత్రలో వాగ్దానాలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయలేదని.. వెంటనే చర్యలు తీసుకోవాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లురెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయుడుపేటకు విచ్చేసిన ఆయన గురువారం స్థానిక యూటీఫ్‌ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహర్‌రెడ్డి సమస్యలపై మాట్లాడితే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని.. రాష్ట్రంలో 60 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 2,45,000 మంది పార్ట్‌ టైం, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారన్నారు. ఇచ్చిన మాట మేరకు వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండు చేశారు. దేశంలో పంజాబ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌లలో సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానానికి ఉత్తర్వులు జారీచేశారని.. ఏపీలో మాత్రం నేటికీ చర్యలు శూన్యమన్నారు. రాష్ట్రంలో నేటికీ సగం మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు జీతాలు చెల్లించకుండా.. పథకాలు ఆగకూడదని అనధికార ఉత్తర్వులు చేయడం వారి నిరంకుశ పాలనకు ఉదాహరణగా చెప్పొచ్చన్నారు. ఉద్యోగులపై ఇలాంటి నిర్లక్ష్య ధోరణి మానుకోవాలన్నారు. 57 వేల ఉపాధ్యాయ పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని.. ఆ పోస్టులు వెంటనే రద్దు చేసేందుకు నేడు రేషనలైజేషన్‌ చేసి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా అర్ధరాత్రి ఉద్యోగుల బదిలీలు ప్రకటించారని.. వాటిలో అనేక అవకతవకలు ఉన్నాయని తెలిపారు. సమావేశంలో యూటీఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు రాజశేఖర్‌, యూటీఫ్‌ శాఖ అధ్యక్షులు సుబ్బారావు, రామ్మూర్తిరాజు, యూటీఫ్‌ నాయకులు ముకుంద, వెంకటేశ్వర్లు, పుట్టయ్య, నాయుడుపేట ఉపాధ్యాయులు పాల్గొన్నారు.