Jul 26,2023 20:37

- సమావేశంలో మాట్లాడుతున్న మనోహర్‌

కడప అర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా మున్సిపల్‌, కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు బి.మనోహర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆగస్టు ఒకటో తేదీన మున్సిపల్‌ కార్యాలయాలు ముట్టడించనున్నట్లు తెలిపారు. ఏడవ తేదీ కలెక్టరేట్‌ ముట్టడి ఉంటుందని పేర్కొన్నారు. 17న చలో విజయవాడ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి అధికారంలోనికి ముందు కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కేవలం 7000 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయడం దుర్మార్గమన్నారు. అందరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. యూనిఫామ్‌, మౌలిక పరికరాలు కార్మికులకు అందించాలని పేర్కొన్నారు. జీవో నెంబర్‌ ఏడు ప్రకారం ఇంజనీరింగ్‌ కార్మికులకు రూ.18,500 వేతనం ఇవ్వాలని చెప్పారు. క్లబ్‌ డ్రైవర్ల కాంట్రాక్టర్‌ బండికి రూ.63 వేలు తీసుకుంటున్నాడని తెలిపారు. కనీసం 30 శాతం జీతాలకు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదన్నారు. సాయి పావని, రెడ్డి ఏజెన్సీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కడప, ప్రొద్దుటూరులో పనిచేస్తున్న కార్మికులతో ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, ఫెడరేషన్‌ జిల్లా కోశాధికారి గోపి, సహాయ కార్యదర్శి ఆనందరావు పాల్గొన్నారు.