ప్రజాశక్తి -కంచరపాలెం : రైల్వే కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, చట్టపరంగా కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ కచ్చితంగా అమలు చేయాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి ఓ.అప్పారావు డిమాండ్ చేశారు. గురువారం కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో డిఆర్‌ఎమ్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ రైల్వేలో ఎన్‌సిసిలో అప్పర్ గేర్ కార్మికులకు సరైన వేతనాలు, ఆరు నెలలుగా పిఎఫ్, ఇఎస్‌ఐ చెల్లించకుండా ఓరియంటల్ సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కాంట్రాక్టు ముగిసి వెళ్ళిపోవాలని చూస్తున్నారన్నారు. తక్షణమే ఆయనపై చర్య తీసుకుని, కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. . కార్మికులంతా స్కిల్డ్ వర్కర్స్ అయినప్పటికీ వారికి నిబంధనల ప్రకారం రూ.26వేలు కాకుండా అతి తక్కువగా రూ.10 వేలు వేతనంతో పనిచేయించడం దారుణమన్నారు. రైల్వేస్టేషన్ ఎ1 ఫెసిలిటీస్ ప్రయివేటు లిమిటెడ్ యజమాని కార్మికులకు చట్టపరంగా జీతాలు ఇవ్వలేదని, కరోనా సాకుతో అనేక మంది కార్మికులను విధుల నుండి తొలగించారన్నారు. ఎన్‌సిసిలో సిఅండ్‌డబ్ల్యు 180 మంది కార్మికులకు నెలలో మూడు మస్తర్ల జీతాలను కాంట్రాక్టరు తినేస్తున్నారని అన్నారు. రైల్వే కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాడతామన్నారు. కార్యక్రమంలో సిఐటియు జోన్ ప్రెసిడెంట్ బి సింహాచలం, నాయకులు ఎస్ శ్రావణ్, కార్మికులు రాజుతల్లి, అర్జున్, హరికష్ణ, శివ, నూకరాజు, ఎన్ రమణ, ఎన్ నరేష్, బి సన్నిబాబు, ఎమ్ సత్యనారాయణ, బి చంద్రశేఖర్ పాల్గొన్నారు










