ప్రజాశక్తి-పొదిలి: మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ అన్నారు. సోమవారం పొదిలి నగర పంచాయతీ మస్టర్ పాయింట్ వద్ద ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఎం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో 90శాతం అమలు చేశానంటున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాంట్రాక్టు వర్కర్స్ అందరినీ పర్మినెంట్ చేస్తామన్న హామీ నెరవేర్చకుండా అన్యాయం చేశారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించారన్నారు. పొదిలి నగర పంచాయతీ వర్కర్లకు నేటికీ హెల్త్ అలవెన్స్ తో కూడిన జీతం అమలు కాలేదన్నారు. డ్యూటీలో ఉండి మరణించిన ఐదుగు రు కార్మికులకు జీ.వో.నెం. 25 ప్రకారం ఇవ్వాల్సిన రూ.5 లక్షల ప్రమాద బీమా నేటికీ ఇవ్వలేదని అన్నారు. యూనిఫాం, కాస్మోటిక్స్ సకాలంలో అందక కార్మికు లు అనారోగ్యం పాలవుతున్నారన్నారని, గత 2 నెలల నుంచి మున్సిపల్ వర్కర్ల కు జీతాలు అందకపోవడంతో కుటుంబాలు గడవక ప్రత్యామ్నాయ పనులకు వెళ్తున్న దుస్థితి దాపురించిందని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోకుంటే పోరాటాన్ని ఉధృతం చేయాల్సివస్తుందని హెచ్చరిం చారు. ఈ ధర్నాలో పొదిలి నగర పంచాయతీ కార్మికులు కెవి నరసింహం, డి సుబ్బయ్య, బి కోటేశ్వరావు, కోటేశ్వరమ్మ, స్వరూప పాల్గొన్నారు.