ప్రజాశక్తి-విశాఖపట్నం: కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని శ్రామిక సంఘం టిఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి బొడ్డుపైడిరాజు డిమాండ్ చేశారు. సిఎస్‌డి యాజమాన్యం 35మంది కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ, బుధవారం ఏడుగంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉక్కునగరంలోని స్మృత్యంజలి పార్కులో కొవ్వొత్తుల వద్ద బైఠాయించి, మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, డిపి కార్మికులను తొలగించే చర్యలను వెంటనే ఆపాలని కోరారు. చనిపోయిన కాంట్రాక్టు కార్మికుల స్థానే వారి కుటుంబసభ్యులకు ఉపాధి కల్పించి ఆదుకునే చర్యలను ఉక్కు యాజమాన్యం చేపట్టాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కాంట్రాక్టు కార్మికులకు ఫైనల్ బెనిఫిట్స్ చెల్లించే బాధ్యతను ఉక్కుయాజమాన్యం చేపట్టాలని, పెరిగిన వేతనాలకు అనుగుణంగా బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాండురంగ జయరాజు, కరణం సురేష్‌కుమార్, కె రాజు, హెచ్ సతీష్, గొందేశి వేణురెడ్డి, కె సోమేష్, జె. జాన్, యన్ వెంకినాయుడు, యు వెంకటరావు, దాసరి సత్యనారాయణ, మస్తాన్, కెఎ.నాయుడు,ధర్మాల నర్సింగరావు, బి.నాగమణి పాల్గొన్నారు.










