ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : లాసన్స్ బే పార్కులో ఉండవలసిన సిబ్బంది కంటే తక్కువ సిబ్బందితో పని చేయిస్తూ మొత్తం బిల్లు డ్రా చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె మూడో జోన్ పరిధిలో ఉన్న లాసన్స్ బే పార్క్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జివిఎంసి నుంచి ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారు ? కాంట్రాక్టు పద్ధతిలో ఎంత మంది పనిచేస్తున్నారు ? అని ఆరా తీస్తూ వారి హాజరు పట్టీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పార్కు నిర్వహణలో జివిఎంసి నుండి ఇద్దరు సిబ్బంది పని చేస్తుండగా, కాంట్రాక్టర్ నియమించిన వారు నలుగురు ఉండాల్సిన చోట గత ఐదు సంవత్సరాల నుంచి ఇద్దరే పనిచేస్తుండడం గమనించి, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని, ఎటువంటి బిల్లులూ మంజూరు చేయరాదని జేడీ (అమృత్) విజయ భారతి, జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఐదు సంవత్సరాల నుంచి పార్కులపై దృష్టి సారించనందున సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.










