Oct 15,2023 21:58

అధ్వానంగా ముదినేపల్లి సెంటర్‌
రోడ్డుపైనే మురుగునీరు
భయాందోళనలో వాహనదారులు
ప్రజాశక్తి - ముదినేపల్లి

          కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యానికి, అధికారుల అలసత్వం తోడు కావడంతో జాతీయ రహదారి గోతులమయమై అధ్వానంగా మారింది. దీంతో ఇటు ప్రజలు, అటు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏప్రమాదం చోటు చేసుకుందోనని వాహనదారులు, ప్రజలు అందోళన చెందుతున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే ముదినేపల్లి ప్రధాన సెంటర్‌.
పామర్రు-దిగమర్రు 165 జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ముదినేపల్లి సెంటర్‌లో విస్తరణ పనులు జరుగుతున్నాయి. పామర్రు నుంచి ఆకివీడు వరకు విస్తరింప చేసేవిధంగా గుత్తేదారుడు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ఈ రహదారి విస్తరణతో ముదినేపల్లి మండలంలో ఎంతోమంది తమ నివాసాలు, స్థలాలు కోల్పోయారు. నష్టపరిహారం అందించడంలో సమస్యలు తలెత్తడంతో కొంతమంది నివాసితులకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందలేదనే విమర్శలు ఉన్నాయి. తొలుత ముదినేపల్లి ప్రధానసెంటర్‌లో 11 నెలల క్రితం డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ పనులు క్రమ పద్ధతిలో చేయకుండా ఇ స్టానుసారంగా, ము క్కలు ముక్కలుగా నిర్మించి మధ్యలో వదిలేశాడు. దీంతో గ్రామంలోని మురుగుతో పాటు, వర్షపునీరు బయటకు పారేందుకు అవకాశం లేకపోవడంతో మురుగునీరంతా ప్రధాన రోడ్డుపైనే నిల్వ ఉంటుంది. మురుగునీరు రోజుల తరబడి జాతీయ రహదారిపై నిల్వ ఉండడంతో దుర్వాసనతో పాటు రహదారి ఆసాంతం గుంతలమయమై వాహన దారులు, ప్రజలు ప్రయాణించేందుకు ఏమా త్రం ఆనువుగా లేదు. గుంతల్లోకి మురుగునీరు చేరుకోవడంతో గుంత ఎంత లోతులో ఉందో తెలియక ద్విచక్రవాహనదారులు గుంతల్లో పడి క్షతగాత్రులుగా మారుతున్నారు. రాత్రివేళల్లో భారీ వాహనాలు గుంతల్లో పడి భారీ శబ్ధాలు వస్తున్నాయి. గత 11 నెలలుగా జాతీయ రహదారి గోతులమయమై ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా అధికారుల్లో ఏమాత్రం చలనంలేదు. డ్రెయినేజీ నిర్మాణ పనులు అసంపూర్తిగా చేయడంతో మురుగునీరు బయటకు పారుదల లేదు. దీంతో సెంటర్‌లోని హోటళ్లు, ఇతర వ్యాపారస్తులు వాడే నీరంతా రహదారిపైకి వచ్చి చేరుతోంది. నెలల తరబడి నీరు రోడ్డుపై, గుంతల్లో నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ప్రజలు, వ్యాపారులు దుర్గంధం భరించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మురుగంతా స్టేట్‌ బ్యాంకు, పోలీస్‌స్టేషన్‌, బస్టాండ్‌, పెట్రోల్‌బంకు ప్రాంతాల్లో నిల్వ ఉంటుంది. దీంతో బ్యాంకు, పోలీస్‌స్టేషన్‌, బస్టాండ్‌, పెట్రోల్‌ బంకులకు వెళ్లే ప్రజలు, వాహనదారలలు రోడ్డుపై ఏర్పడ్డ గుంతలతో, మురుగునీటి దుర్గంధంతో నరకం అనుభవిస్తున్నారు. నెలల తరబడి ఈ పరిస్థితి ఉండడంతో దుర్గంధం భరించలేక తాము రోగాల బారిన పడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిపై ఏర్పడ్డ గుంతలను పూడ్పించి, ప్రమాదాల బారిన పడకుండా వాహనదారులను, ప్రజలను రక్షించాలని, అలాగే అసంపూర్తిగా నిర్మించి మధ్యలో వదిలేసిన డ్రెయినేజీ పనులు వెంటనే కాంట్రాక్టర్‌ పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.