ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్ : స్కీం వర్కర్స్, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు నగర ఆఫీస్ బేరర్స్ సమావేశం నగర అధ్యక్షుడు సిహెచ్. రాంబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు సక్రమంగా రాక, అతి తక్కువ వేతనాలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆశ, అంగన్‌వాడీ, మధ్యాహ్నం భోజనం. కేంద్ర ప్రభుత్వం స్కీంలలో పనిచేస్తున్న వారందరికీ ప్రతి నెలలో వేతనాలు ఇవ్వాలన్నారు. స్కీమ్‌లలో పనిచేస్తున్న అందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. లేదా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐటియు నగర ఉపాధ్యక్షుడు జి.రమేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దశలవారీగా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు ఏళ్ళు పూర్తవుతున్నా ఒక్క కార్మికుడిని రెగ్యులర్ చేయకపోవటం దారుణమన్నారు. స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ చేసేందుకు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో సిఐటియు నగర కార్యదర్శి టి.మహేష్, నగర ఉపాధ్యక్షులు తంబి శ్రీనివాసులు, ఎస్‌డి.హుస్సేన్, సహాయ కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, జె.ఉదరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.