Jun 07,2023 23:18

ప్రజాశక్తి-గుంటూరు : కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం విధించిన నిబంధన వల్ల కొందరు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. దాదాపు సగం మంది క్రమబద్ధీకరణ అర్హత కోల్పోతున్నారు. అన్ని అర్హతలతో, ఒకే జీతంతో, ఒకేశాఖలో పనిచేస్తున్న కొందరు రెగ్యులర్‌ అవుతుండగా, కొందరు అవకాశం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి భిన్నంగా వడపోత కార్యక్రమం చేపడుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అర్హత మేరకు సాధ్యమైనంత ఎక్కువ మందికి రెగ్యులర్‌ చేస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన ప్రభుత్వం 2014 జూన్‌ 2, రాష్ట్ర విభజన నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారి సర్వీసులనే క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించటంపై ఆశావహులు మండిపడుతున్నారు. ఐదేళ్ల సర్వీసుకు ఒకటి రెండేళ్లు, నెల రోజుల వ్యత్యాసంతో కూడా క్రమబద్ధీకరణకు దగ్గరగా వచ్చి అందకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ ఇంటర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ పనిచేస్తున్న అధ్యాపకులు, ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారు సగం మంది క్రమబద్ధీకరణకు దూరం అవుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 4వేల మంది అధ్యాపకులు ఉండగా, ఉమ్మడి జిల్లాలో సుమారు 150 మంది ఉంటారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో జిల్లాల్లో ఏఎన్‌ఎంలు ఇతర ఉద్యోగులు సుమారు 400 మంది ఉన్నారు. వీరిలో ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రస్తుతం సగం మందే క్రమబద్ధీకరణ అవుతారని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు.
2009 తర్వాత నియామకం పొందిన వారు క్రమబద్దీకరణకు అవకాశం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 2001 నుంచి 2014 వరకూ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామకాలు జరిగాయి. వీరిలో దాదాపు సగం మందికిపైగా 2008, 2009, ఆ తర్వాత సంవత్సరాల్లో నియమాకం పొందిన వారున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం 2009 జూన్‌ 2 తర్వాత నియామకం పొందిన వారికి క్రమబద్ధీకరణ అర్హత లేదు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్‌ 2 నాటికి విధుల్లో ఉన్న వారిని క్రమబద్ధీకరణ చేయటంతో ఎక్కువ మంది లబ్ధి పొందారు. అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనలు విధిస్తున్నారని, తెలంగాణలో మాదిరిగా ఎపిలోనూ అందరికీ లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకే శాఖలో పనిచేస్తూ కొందర్ని రెగ్యులర్‌ చేస్తూ, కొందర్ని చేయకపోవటం వల్ల వారి మద్య మనస్పర్దలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దశల వారీగా రెగ్యులర్‌ చేయాలని భావిస్తున్నా.. మిగిలిన వారిని ఎప్పుడు క్రమబద్ధీకరిస్తారనే విషయంలో స్పష్టత లేదు. దీనిపై అధ్యాపకులు, ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
2014 నాటికి విధుల్లో ఉన్న అందర్నీ క్రమబద్ధీకరించాలి
ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విధించిన ఐదేళ్ల సర్వీసు నిబంధన సరికాదు. దీని వల్ల అందరికీ న్యాయం జరగదు. తెలంగాణలో మాదిరిగా రాష్ట్ర విభజన నాటికి సర్వీసులో ఉన్న ఉద్యోగులు అందర్నీ క్రమబద్ధీకరణ చేయాలి.
ఎన్నో ఆశలు పెట్టుకున్నాం
కె.రత్నకుమారి, ప్రభుత్వ కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంఘం

ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అందర్నీ క్రమబద్ధీకరిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ ఐదేళ్ల సర్వీసు నిబంధన వల్ల కొద్దిపాటి వ్యత్యాసంతో క్రమబద్ధీకరణకు దూరవుతున్నాం. దాదాపు 14 ఏళ్ల సర్వీసున్నా ఉద్యోగ భద్రత లేక, దినదిన గండంగా జీవిస్తున్నాం.
సరైన ప్రాతిపదిక లేదు
ఆర్‌.స్వాతి, పాలిటెక్నిక్‌ కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంఘం

ప్రభుత్వం ఐదేళ్ల సర్వీసు నిబంధనకు ప్రాతిపదికేమీ లేదు. కేవలం అర్హులను కుదించటానికే ఈ నిబంధన విధించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటుందని ఇప్పటి దాకా ఎన్నో ఆశలతో ఉన్న ఉద్యోగుల తీవ్ర నిరాశలో ఉన్నారు. మిగిలిన వారిని క్రమబద్ధీకరించే విషయం కూడా స్పష్టతివ్వాలి.