Jun 20,2023 00:06

నినాదాలు చేస్తున్న స్టాఫ్‌ నర్సులు, నాయకులు

ప్రజాశక్తి-పాడేరు: ప్రభుత్వం తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు.గత కొంతకాలంగా సర్వీస్‌ చేస్తున్నామని, కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పని చేశామని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ కన్వీనర్‌ శెట్టి నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంకాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేస్తామని ప్రకటించడంతో స్టాఫ్‌ నర్సులు ఆశగా ఎదురు చూశారన్నారు. ప్రభుత్వం నిబంధన ప్రకారం కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్స్‌లకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. తక్షణం వారి సర్వీస్‌ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్‌ చేయాలని అందుకు జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, జూన్‌ 2, 2014 నాటికి ఐదు సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి చేసుకున్న 6,662 మంది రెగ్యులర్‌ చేస్తామనిరాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం సమంజసం కాదని తెలిపారు. నిబంధనలను మార్పు చేసి ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులను తక్షణమే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఐటిడిఏ పరిధిలో ఉన్న బ్యాక్‌ లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని తెలిపారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్‌ నర్సుల కమిటీ ప్రతినిధులు డి.ధనలక్ష్మి, జి.పద్మలత, టీ.చిలకమ్మ సిహెచ్‌ స్వాతి, బి.భారతి వి.రమాదేవి, ఎం.వసంత కుమారి పాల్గొన్నారు.