Sep 06,2023 00:27

మహాజనసభలో మాట్లాడుతున్నసిపిఎం కార్పొరేటర్‌ గంగారావు

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సొసైటీ 11వ మహాజనసభ ఉక్కునగరం సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. ఈ మహాజనసభకు 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు హాజరై మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోనే అసంఘటిత కార్మికులకు మొట్టమొదటిసారిగా పొదుపు సహకార సంఘంగా ఏర్పడి ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికులందరూ సొసైటీలో చేరాలని, చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సహకార సంఘాలను ప్రోత్సహించకుండా నిర్వీర్యం చేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో భాగంగా సభ్యుల పిల్లలకు మెరిట్‌ అవార్డులను అందజేశారు. సొసైటీ కార్యదర్శి పి.నారాయణరావు మాట్లాడుతూ, కాంట్రాక్ట్‌ కార్మికులకు సొసైటీ స్థాపించినప్పటి నుంచి అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. సుమారు 5000 మంది సభ్యులతో రూ.10 కోట్ల టర్నోవర్‌ కలిగి, ఇప్పటివరకు రూ.12 లక్షలు నికర లాభాలను అర్జించిందన్నారు. బ్యాంకులతో పోల్చుకుంటే అతి తక్కువ వడ్డీ రేట్లకే సభ్యులకు రుణాలు మంజూరు చేస్తోందని, సభ్యులకు వెల్ఫేర్‌ కార్యక్రమాలు, సభ్యుల పిల్లలకు మెరిట్‌ అవార్డులు ఇస్తున్నామని తెలిపారు. సభ్యుడు ఏ కారణం చేతనైనా మరణిస్తే అతని కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా సొసైటీ నిరంతరం పనిచేస్తుందన్నారు. సొసైటీ అధ్యక్షులు ఆడారి అప్పారావు, డైరెక్టర్లు వై.శ్యామ్‌సుందర్‌, కె.సత్యవతి, శశిభూషణరావు, శ్రీనివాసరావు, ఎస్‌.నాగకృష్ణ, సొసైటీ ప్రతినిధులు, స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ అధ్యక్షులు జి.శ్రీనివాసరావు, నమ్మి రమణ పాల్గొన్నారు.