ప్రజాశక్తి-గుంటూరు : కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీక రించాలని సమాన పనికి-సమాన వేతనం ఇవ్వాలని జెఏసి ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ గుంటూరు జిల్లా చైర్మన్ బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. జెఎసి సెక్రెటరీ జనరల్ బి.ముత్యాలరావు అధ్యక్షతన ఆదివారం పాతగుంటూరు, సిఐటియు కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో 2014 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారినే రెగ్యులర్ చేస్తామని ఎక్కడా వైసిపి చెప్పలేదన్నారు. అందరినీ రెగ్యులరై చేస్తామని చెప్పందని, కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను మోసగిస్తుందని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చి, తక్కువ వేతనాలతో జీవోలను విడుదల చేసిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అందరు ఐక్యంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. హామీలు అమలయ్యే దాకా ఆందోళనకు సంసిద్ధం కావాలన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కొత్తగా వచ్చారని, ఏడాది అయ్యింది అంటూ మంత్రి వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి, 2022 డిసెంబర్ 31 నాటికి పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ ఈనెల 22న చేపట్టిన కార్యాచరణలో భాగంగా జులై 2న పట్టణ, మండల సదస్సులు, 5న సిఎంకు ఈమెయిల్స్, 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌ఒడిలకు ఈమెయిల్స్ పంపాలని, 15న మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని, 24న కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు, ఆగస్టు 5న నాయకుల నిరాహార దీక్షలు, ఆగస్టు 16న ఛలో విజయవాడ నిర్వహించాలని తీర్మానిం చారు. ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వి.రమేష్‌బాబు వివిధ విభాగాల నాయకులు జి.పవన్, రవీంద్రబాబు, తిరుమలయ్య, సురేష్, రాజేష్, రాంబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










