ప్రజాశక్తి-పాడేరు:క్రమబద్ధీకరణ చేయడం అంటే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడమా అని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్,్ట అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వైసిపి ప్రభుత్వం నమ్మించి ద్రోహం చేస్తుందని విమర్శించారు. మంగళవారం చింతపల్లి మండలం బలపం మారముల పంచాయతీ పిహెచ్సిలో ఈనెల 20న అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంలో జరుగనున్న సిఐటియు మొదటి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థ లేకుండా చేస్తానని, ఉద్యోగులందరికీ క్రమబద్ధీకరణ చేసి పర్మినెంట్ ఉద్యో గాలు ఇస్తానని ప్రతిపక్ష హౌదాలో పాదయాత్రలో చెప్పిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటలు నీటి మూటలుగా మిగిలాయని ఎద్దేవా చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ లేకుండా చేయడం అంటే ఉద్యోగాల నుంచి తొలగించడమా అని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు లోపు సర్వీసున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెండున్నర లక్షల మంది ఉన్నారన్నారు. ఐదేళ్లు దాటి పని చేసిన ఉద్యోగ, కార్మికుడికి పర్మినెంట్ చేయాలని చట్టంలో ఉందని గుర్తు చేశారు. ఒకవైపున దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయటం లేదా మూసేయటం చేస్తుంటే దీన్ని వ్యతిరేకించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు వ్యవస్థని సమూలంగా రద్దు చేయడానికి పూనుకోవటం దారుణమన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కాలం చెల్లినట్టేనని, అందరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాజంగి, లంబసింగి, లోతుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జిల్లా మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాంగి ధనుంజరు, సాగిన చిరంజీవి, సిఐటియు మండల కార్యదర్శి వేములపూడి రామకృష్ణ, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.










