కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గాంధీ విగ్రహానికి వినతి
పార్వతీపురం టౌన్: కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని జెఎసి నాయకులతో కలిసి ఆ ఉద్యోగులు స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద గాంధీ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతిపత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి నాయకులు బివి రమణ, బి.ఈశ్వరరావు మాట్లాడుతూ సర్వ శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్, ఉద్యోగ భ్రత కల్పిస్తామన్న సిఎం హామీ నేటికీ అమలు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఉద్యోగ విరమణ సదుపాయాలు కల్పించాలని, ఉద్యోగులకు రూ.10 లక్షలు ఉద్యోగ విరమణ పరిహారం, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని, ప్రతినెల ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలన్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు వై.గౌరమ్మ, పి.క్రాంతి కుమార్, ఎం.కాంచన, సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, పి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.










