ఆశలన్నీ చెట్టుకొమ్మకు వేలాడుతున్నాయి
రాళ్లదెబ్బలు తగులుతుంటే
ఒక్కొక్కటి రాలి పడిపోతున్నాయి
రాలిపడి ...ఎండిపోయిన ఆకులన్నీ
పెద్ద శబ్దాలను చేస్తూ కన్నీరు కారుస్తున్నాయి
గుండెలో దాగిన దుఃఖాన్ని వెళ్లగక్కుతున్నాయి
కొమ్మలన్నీ తమ బంధువులు..
దూరమైనట్లు మౌనాన్ని ధరించాయి
పిట్టగూళ్ళలోని పక్షులన్నీ రెక్కలురాని
పసికూనలను హృదయంలో దాచుకొని
పగబట్టిన కాలాన్ని తలచుకుంటూ..
తలదాచుకుంటున్నాయి
ఉడుతలు, వానరాల గుంపంతా
నిలువనీడను కోల్పోయి
దు:ఖ సముద్రాన్ని
మీదేసుకొని దిగులు పడుతున్నాయి
కాలం మారుతుంది
కాంతి కిరణాలేవో కాస్త వెలుగును పంచుతున్నాయి
చెట్టు చిగురిస్తుంది ఇప్పుడు
లేలేత ఆకులన్నీ ఎదలో నుండి పుట్టుకొస్తున్నాయి
ఆవిరైన ఆశలన్నీ మళ్ళీ పూస్తున్నాయి
ఆకుపచ్చని రంగు ఇపుడు అమ్మతనాన్ని పంచుతుంది
ఆకులన్నీ పచ్చని తోరణాలై...
అలంకరిస్తున్నాయి తరువుని
కొమ్మలన్నింటికీ ప్రేమ బంధాలు
అనే పూలు పూస్తున్నాయి
ఆశలు అనే ఫలాలు కాస్తున్నాయి
పక్షుల గూడిప్పుడు
పచ్చగా పరుచుకున్న
అమ్మ కొంగులో ఒదిగిపోయింది
పశుపక్ష్యాదులకు ఇపుడు
నిండైన ఆవాసం
కాలమెప్పుడూ ఒకేలా ఉండదు సుమీ..
కష్టాల కడలిలో చిక్కుకున్న..
నీ జీవితానికి ప్రయత్నం అనే కవచాన్ని తొడుగు
చెట్టులా చిగురిస్తావు
మహావృక్షమై ఎందరికో నీడనిస్తావు
అశోక్ గోనె
94413 17361