ప్రజాశక్తి -ములగాడ : కాంక్రీట్ మిక్సర్ లారీకి సిగల్ ఇస్తుండగా లారీతో పాటు ఓ వ్యక్తి గోతిలో పడి దుర్మరణం పాలైన ఘటన ఎంఇఎస్ సంస్థలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మల్కాపురం పోలీసుల కథనం ప్రకారం... మల్కాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంఇఎస్ ఆఫీసు వద్ద భవన నిర్మాణ పనుల్లో భాగంగా గోపాల్ టెక్నోఖాన్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ యొక్క కాంక్రీట్ లారీ వచ్చింది. అదే కంపెనీలో బుల్డోజర్ డ్రైవర్‌గా ఆరిలోవ ప్రాంతానికి దినేష్ (23) పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కాంక్రీట్ లారీకి దినేష్ సిగల్ ఇస్తుండగా అకస్మాత్తుగా రోడ్డు యొక్క మట్టి కుంగిపోయింది. దీంతో దినేష్ కాలు జారి గొయ్యిలో పడిపోయాడు. అతనిపై కాంక్రీట్ లారీ, మట్టి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాపురం సిఐ లూధరబాబు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి వివరాలను సేకరించారు. మృతుని కుటుంబానికి సమాచారం అందజేశారు. మృతుని కుటుంబ సభ్యులు వచ్చి బోరున విలపించారు.
18 లక్షలు నష్టపరిహారం చెల్లింపునకు అంగీకారం
మృతి చెందిన దినేష్ కుటుంబానికి రూ.18 లక్షల నష్టపరిహారం, రూ.6 లక్షలు పిఎఫ్ సొమ్మును అందించేందుకు కాంట్రాక్టర్ అంగీకరించారు. ఈ చర్చల్లో 62వ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు, ఆరిలోవకు చెందిన పెద్దలు పాల్గొన్నారు.










