లక్నో : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి ప్రకటనపై బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. యుపి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. అందుకే ప్రకటించిన కొద్దిగంటల్లోనే సిఎం అభ్యర్థి ప్రియాంక తన వైఖరిని మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కేవలం బిజెపియేతర ఓట్లను మాత్రమే చీలుస్తుందని.. ఈ సమయంలో బిఎస్‌పికి ఓటు వేయడమే మంచిదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుపి ప్రజలు కాంగ్రెస్‌కి ఓటువేసి తమ ఓట్లను వృధా చేయకుండా ఏకపక్షంగా బిఎస్‌పికి వేస్తే.. మంచి భవిష్యత్తు ఉంటుందని మాయావతి పేర్కొన్నారు. అయితే యుపి ఎన్నికల్లో మాయావతి పోటీ చేయడం లేదు. యుపిలో కాంగ్రెస్ లాంటి పార్టీలు ప్రజల దృష్టిలో ఓట్లను చీల్చే పార్టీలని మరో ట్వీట్‌లోపేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనని హింట్ ఇచ్చిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అభ్యర్థిపై పదేపదే మీడియా ప్రశ్నలు అడుగుతుండటంతో ఒకింత అసహనానికి గురై... తానే ముఖ్యమంత్రినని మీడియాతో వ్యాఖ్యానించానని చెప్పుకొచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ, బిజెపి ఒకే తరహా విధానాలు అనుసరిస్తున్నాయని, మతతత్వం, కులతత్వం ఎజెండాతోనే రెండు పార్టీలు ముందుకు వెళ్తున్నాయని, పరస్పరం లబ్ధి చేకూర్చుకుంటున్నాయని ప్రియాంక విమర్శించారు. బిఎస్‌పి అధ్యక్షురాలు మాయవతి మౌనంగా ఉండటంపై కూడా ఆమె పలు ప్రశ్నలు సంధించారు.










