Mar 11,2023 20:34

మాట్లాడుతున్న లక్ష్మీ నరసింహ యాదవ్‌

కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయండి
డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్‌
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

    కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి, ప్రజలను చైతన్యవంతుల్ని చేసి పార్టీని బలోపేతం చేయాలని నంద్యాల పార్లమెంట్‌ డిసిసి అధ్యక్షులు, ఏఐసిసి సభ్యులు లక్ష్మీ నరసింహ యాదవ్‌ పేర్కొన్నారు. శనివారం పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆళ్లగడ్డ కమిటీ సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గత మూడున్నరేళ్లకు పైగా చీకటి పాలన సాగుతోందని, చరిత్రలో ఇంతటి నియంతృత్వ, ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని ఎవరూ చూసి ఉండరన్నారు. బడుగు బలహీన వర్గాలు బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే నీచమైన పాలన సాగుతోందన్నారు. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. అధికారం మొత్తం ఒకరిద్దరి చేతుల్లోనే కేంద్రీకృతమైందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌ ఆమోదించిన రాష్ట్ర స్వీకరణ చట్టం 2014లోని అంశాలను, పదేళ్ల ప్రత్యేక హోదాను కేంద్రం నుంచి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కేవలం బటన్‌ నొక్కే సిఎంగా మిగిలిపోయారన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్‌పై జగన్‌ మాట ఇచ్చి విస్మరించారన్నారు. వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోలుకోలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ప్రజా వ్యతిరేఖ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి నంద్యాల జిల్లా కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు చేపట్టిన 'హత్‌ సే హత్‌ భారత్‌ జోడో అభియాన్‌ యాత్ర' స్ఫూర్తితో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మార్గదర్శకత్వంలో జనవరి 26 నుంచి మార్చి 26 వరకు అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, ప్రతి ఇల్లు కార్యకర్తలు తిరిగి ప్రజలను చైతన్య పరచడమే ధ్యేయంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఆళ్లగడ్డ మండల అధ్యక్షులు బరగొడ్ల హుస్సేన్‌ బాషా, మైనార్టీ స్టేట్‌ సెక్రటరీ శంసుల్‌ హక్‌, జిల్లా ఉపాధ్యక్షులు, పిసీసీ మెంబర్‌ గంధం మల్లేశ్వర్‌ రెడ్డి, ఆళ్లగడ్డ కంటెస్ట్‌ అభ్యర్థి, పిసిసి మెంబర్‌ చాకలి పుల్లయ్య, పసుపులేటి లక్ష్మి నరసింహుడు, పాపాజి, వెంకట సుబ్బయ్య, నాగయ్య, దస్తగిరి, దాదా, రమణ, రాజేష్‌, అశోక్‌, హరుణ్‌, షాదిక్‌, మగ్బూల్‌, హుస్సేన్‌ పీరా తదితర నాయకులు పాల్గొన్నారు.