
ప్రజాశక్తి- నక్కపల్లి :కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగారు. నక్కపల్లిలో కాంగ్రెస్ పార్టీ నేత మేడేటి శంకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. బాణాసంచా పేల్చారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు చూస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, గోవింద్, అశోక్, చిరంజీవి, చక్రి సింహాద్రి, నాగేశ్వరరావు, గణేష్ పాల్గొన్నారు. దేవవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేత బి.ఏసు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సత్యనారాయణ, గణేష్, అప్పలకొండ, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్‌పై సంపూర్ణ విశ్వాసం
నర్సీపట్నంటౌన్:కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలపై కర్ణాటక ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, నర్సీపట్నం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మీసాల సుబ్బన్న అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పూర్తి నమ్మకం ఉంచారన్నారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు సంపూర్ణ మద్దతును ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడోయాత్ర అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టడానికి తోడ్పడిందన్నారు. కర్ణాటక ప్రజలు భారతీయ జనతా పార్టీని పూర్తిగా తిరస్కరించారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై పూర్తి నమ్మకం ఉంచిన కర్ణాటక ప్రజలకు, పార్టీ గెలుపును తన భుజ స్కందాలపై వేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
ప్రజాశక్తి -భీమునిపట్నం : కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై స్థానిక పార్టీ నాయకులు శనివారం గంట స్తంభం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, పిసిసి సభ్యులు తెడ్డు రామదాసు మాట్లాడుతూ, కేంద్రం బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతే ప్రస్తుత ఫలితాలకు నిదర్శనమన్నారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాహుల్ గాందీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నిమ్మకాయల పైడిరాజు, కె.సన్యాసిరావు, వి.ఎల్లారావు, శేఖర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
గెలుపుపై హర్షం
పెందుర్తి : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంపై ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ షేక్ షఫీ ఉల్లా హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షఫీ ఉల్లా మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం బిజెపి పతనానికి నాంది పలుకుతుందన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన జోడోయాత్రను ప్రజలు స్వాగతించారని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో కూడా అధికారంలోకి తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెందుర్తి నియోజవర్గ అధ్యక్షులు ఆడారి రమేష్ నాయుడు, కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు వెనకోట రాము, బిఎస్.నాయుడు, కొమ్మాది లక్ష్మాజి తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి : కర్ణాటక రాష్ట్రం శాసనసభ ఎన్నికలలో అత్యధికంగా 136 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా శనివారం కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోయిన భానుమూర్తి యాదవ్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ పతనం కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంతో మొదలైందని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావం కర్ణాటక ఎన్నికలపై స్పష్టంగా కనిపించిందన్నారు. కర్ణాటకలో విజయం స్ఫూర్తితో రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా అవతరించడం తథ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కెఎస్‌ఏ రామయ్యనాయుడు, కాళ్ళ సత్యనారాయణ, కత్తెర శ్రీధర్, సేనాపతి రాజు, కెవి.మాణిక్యం, ఆర్‌ఆర్ నాయుడు, వాయిబోయిన రాజు, బాల మురళి పాల్గొన్నారు.