Feb 14,2022 16:35

లక్నో :  కాంగ్రెస్‌ పార్టీని నాశనం చేయడానికి ఆ ఇద్దరు అన్నాచెల్లెళ్లు చాలంటూ యుపి ముఖ్యమంత్రి యోగి విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలైన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీల కారణంగానే కాంగ్రెస్‌ నాశనమవుతుందని, బయటివారు అక్కర్లేదని అన్నారు. 'బేకార్‌' కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దంటూ ఉత్తరాఖండ్‌ ప్రజలకు సూచించారు. సోమవారం మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హిజాబ్‌ వివాదంపై మాట్లాడుతూ.. పాఠశాలల్లో సరైన డ్రెస్‌ కోడ్‌ ఉండాలని అన్నారు. గజ్వా-ఏ-హింద్‌ కోసం వారు కంటున్న కలలు కయామత్‌ వరకు నెరవేరవని చెప్పారు. ఇది నవ భారతమని, ప్రపంచంలో గొప్ప ప్రజాదరణగల నేత ప్రధాని మోడీ ఉన్న భారతదేశమని మోడీని ప్రశంసించారు. నవ భారతం రాజ్యాంగం ప్రకారం పని చేస్తోందని, షరియా ప్రకారం కాదని అన్నారు. అందరి నమ్మకం, అందరి కృషితో  తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.

వ్యక్తిగత ఇష్టాలను, ప్రాథమిక హక్కులు, నమ్మకాలను దేశంపైనా, వ్యవస్థలపైనా రుద్దలేమని చెప్పారు. కాషాయం ధరించాలని యుపి ప్రజలను, కార్యకర్తలను అడిగలేదని.. తమకు నచ్చినదాన్ని ప్రజలు ధరిస్తారన్నారు. అయితే పాఠశాలల్లో మాత్రం డ్రెస్‌ కోడ్‌ ఉండాలని అన్నారు. ప్రతి బాలిక, భారత దేశ బిడ్డ హక్కులు, స్వాతంత్య్రం కోసమే మోడీ ప్రభుత్వమని  చెప్పారు. బాలికలకు న్యాయం చేయడం, వారిని గౌరవించడం, వారిని సాధికారులుగా తీర్చిదిద్దడం కోసమే ప్రధాని మోడీ ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేశారని అన్నారు.