2024 లోక్‌్‌సభ ఎన్నికలకు ముందు కీలకమైన అనేక శాసనసభ ఎన్నికలూ రానున్నాయి. 2022 చివరలో గుజరాత్, హిమాచల్ ఎన్నికలు వుంటాయి. త్రిపురతో సహా మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు 2023 మార్చిలో వుంటాయి. మే, డిసెంబర్ మధ్య కర్ణాటక,చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ వంటి రాష్ట్రాల ఎన్నికలు వస్తాయి. ఇందులో చాలాచోట్ల కాంగ్రెస్ ఒక ముఖ్య శక్తిగా వుంది. వాటిలో ఆ పార్టీ జయాపజయాలు 2024లో దాని పాత్రను చాలావరకూ నిర్ధారిస్తాయి.
అయిదు రాష్ట్రాల ఎన్నికలలో ఘోర పరాజయం, పాలించే పంజాబ్‌ను కూడా చేజార్చుకోవడం జరిగాక కాంగ్రెస్ పార్టీ ఒక విధమైన అస్తిత్వ సంక్షోభంలో అంతర్గత ఘర్షణలో మునిగిపోయింది. దేశంలో ఇప్పుడు రాజస్థాన్, చత్తీస్ గఢ్ మినహా సొంతంగా పాలించే రాష్ట్రాలేవీ లేవనే వాస్తవం ఆ పార్టీ నాయకులనూ శ్రేణులనూ కూడా కలవరపెడుతున్నది. కాంగ్రెస్ నిరంతరాయంగా క్షీణిస్తున్న పరిస్థితిని ఈ ఫలితాలు పరాకాష్టకు చేర్చాయి. జి23గా పేరొందిన అసమ్మతివాద నాయకుల విమర్శల మధ్య గత సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ముందు గాంధీ కుటుంబ నాయకత్వానికి సవాలు అని కథనాలు రావడం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాహుల్ గాంధీయే వుండాలని ప్రకటించడం జరిగాయి. ఈ పూర్వరంగంలో వర్కింగ్ కమిటీ ఓటమిపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతూ పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలనీ, రాబోయే ఎన్నికలను దీటుగా ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. రాహుల్‌గాంధీ రాజీనామా తర్వాత సోనియా తాత్కాలికంగా నిర్వహిస్తున్న ఎఐసిసిఅద్యక్ష పదవితో సహా దేశవ్యాపితంగా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని పునరుద్ఘాటించింది. ఇంతలోనే కపిల్ సిబాల్ రాహుల్‌గాంధీ పెత్తనాన్ని సవాలు చేయగా మరికొందరు ఖండించారు. జి23 తరపున హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర కుమార్ హుడా బుధవారం రాహుల్‌గాంధీతో సమావేశమై గురువారం తమ గ్రూపునకు నివేదించారు. అక్కడ మంతనాల తర్వాత మరో సీనియర్ గులాం నబీ ఆజాద్ శుక్రవారం సోనియాగాంధీతో సమావేశమైనారు. పార్టీ అద్యక్షులుగా సోనియా కొనసాగడాన్ని తామెవరూ ప్రశ్నించలేదని, ఆగష్టులో సంస్థాగత ఎన్నికలు ముగిసేవరకూ ఆమె ఆ పదవిలో వుండటంపై అభ్యంతరాలు లేవని ఆజాద్ చెప్పారు.వీరందరికీ రాహుల్‌గాంధీ పాత్రపైనే అభ్యంతరాలు వున్నాయని సంకేతాలు వస్తున్నా సర్దుబాటు చేసేందుకు సోనియా తంటాలు పడుతుంటారు.
ఆజాదూ,అధిష్టానం
ఇటీవలి కాలంలో ఆజాడ్‌కు బిజెపి పద్మభూషణ్ బిరుదు ఇస్తే ఆయన విపరీతంగా కృతజ్ఞతలు చెప్పడం, రాజ్యసభలో రిటైరవుతున్న సమయంలో ప్రధాని మోడీ మరీమరీ పొగడ్డమే గాక కళ్లనీళ్లుపెట్టుకుని భావోద్వేగానికి గురి కావడం, జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్‌లో ఆజాద్ సోదరుడు నిష్క్రమించడం వంటి పరిణామాలు చూశాం. ఇవన్నీగాక విడ్డూరమైన పద్దతిలో ఆజాద్ ను మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్థిగా చేయాలని చూస్తున్నదని కూడా తెలుగు మీడియాలో నిరాధార కథనాలు వచ్చాయి. మొన్నటి ఓటమి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ను చచ్చిపోనివ్వబోమనీ, జీవితమంతా ఆ పార్టీలో గడిపిన తమలాటి వారికి ప్రస్తుత దుస్థితి చాలా బాధ కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. జి23 ఆధ్వర్యంలో దాదాపు పార్టీ చీలికకు కూడా అడుగులు పడుతున్నాయనే వార్తల మధ్య రాహుల్ సోనియాలు ఈ చర్చలు జరిపారని గుర్తుంచుకోవాలి.
వర్కింగ్ కమిటీలు, ఇతర చర్చలు ఎన్ని జరిగినా కాంగ్రెస్ పార్టీలో గాంధీకుటుంబ ప్రాధాన్యత తగ్గబోదనీ, ఒకరిద్దరు వ్యతిరేక స్వరాలు వినిపించినా వెంటనే ఇతరులు ఖండించడం, అధిష్టానం బుజ్జగించి పంపడం షరామామూలేనని చాలాసార్లు రుజువైంది. ఇప్పుడు జరుగుతున్నదీ దాదాపు అదే. మోడీ, ఇతర బిజెపి నాయకులు తమ మత రాజకీయాలను కార్పొరేట్ ప్రైవేటీకరణనూ ఏకపక్ష పోకడలను సమర్థించుకోవడానికి గాను వంశపారంపర్యం అంటూ దాడి చేయడం కూడా ఒక ప్రహసనంగా నడుస్తుంటుంది. రోగి కోరిందీ వైద్యుడు ఇచ్చిందీ ఒకటేనని ఈ రెండూ సరిపోతుంటాయి. ఏతావాతా దేశంలో బిజెపిపై పోరాటం దెబ్బతినిపోతుంటుంది.కాంగ్రెస్ అంతర్గత సంక్షోభంలో ఈ రాజకీయ కోణం కన్నా ఎవరు నాయకత్వం వహించాలన్నదే ప్రధానమవుతుంటుంది. ఒక్కోచోట ఎన్నికల్లో ఓడిపోతున్న కొద్దీ కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి ఫిరాయింపులు కూడా పెరుగుతున్నాయి. అలాటివారు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు కూడా అయ్యారు. ఇప్పుడు ఆజాద్‌గానీ ఇతర జి23 నాయకులు గాని మాట వరసకు బిజెపిని ఎదుర్కొవడం గురించి అంటున్నా, సైద్ధాంతికంగా ఆ విషయం చెప్పడం నామమాత్రంగానే జరుగుతుంటుంది. ఇక రాహుల్‌గాంధీ వంటివారైతే బిజెపికి విరుగుడుగా తాము కూడా మెత్తటి హిందూత్వను ప్రదర్శిస్తే చాలన్నట్టు ప్రవర్తిస్తుంటారు. బిజెపిని ఓడించడం కన్నా తమ ప్రత్యర్థులైన ప్రాంతీయ పార్టీలను కేరళ వంటిచోట్ల కమ్యూనిస్టులను దెబ్బతీయడానికి పాకులాడుతుంటారు. సున్నితమైన చైనా సరిహద్దు సమస్య వంటిదాన్ని పదేపదే లేవనెత్తుతుంటారు. సరళీకరణ విధానాలు తీసుకొచ్చిన ఆద్యులు వారే గనుక ఆర్థికరంగంలో వారుచేసే విమర్శలకు పెద్దగా స్పందన రాదు కూడా. ప్రజల ముందు సరైన ప్రత్యామ్నాయం చూపించలేకపోవడం, ఉద్యమాలు పోరాటాలలో పాలుపంచుకోలేకపోవడం ఎన్నికలలో ఓటముల పాలవడానికి ఉన్న పునాది హరించుకుపోవడానికి కారణం . ఉదాహరణకు ఇటీవలి రైతాంగ పోరాటాలకు పంజాబ్ ముఖ్య కేంద్రమైనా అక్కడ ఆప్ గెలిచింది తప్ప కాంగ్రెస్ కాస్త కూడా నిలబడలేకపోయింది. యుపిలో బిజెపి బిఎస్‌పి సీట్లు తగ్గితే ఎస్‌పికి వచ్చాయి తప్ప కాంగ్రెస్‌కు బదలాయించబడలేదు. రాహుల్‌గాంధీ లోక్‌సభ నియోజకవర్గమైన అమెథీలో గతంలోనే ఓడిపోయి కేరళలోని వైనాడ్ నుంచి లోక్‌సభకు వెళ్లారు. తర్వాత ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో దీర్ఘకాలంగా అక్కడే వుండి సర్వం తానై ప్రచారం నడిపినా ఇప్పుడు అమెథీతోపాటు రారుబరేలీలోనూ కాంగ్రెస్ సీట్లు కోల్పోయింది. కేవలం రెండు సీట్లు, 2.3శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. యుపిని వదిలేసినా మిగిలిన రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ వున్న బలం నిలుపుకోలేకపోయింది.
అన్నా చెల్లెళ్ల నిర్వాకాలు
ఇంత జరిగినా గాంధీ కుటుంబం విజయ రహస్యమనే వీరవిధేయులకు ఏం చెప్పాలి? 2013లో అట్టహాసంగా ఉపాధ్యక్ష పదవి తీసుకుని మరో నాలుగేళ్ల తర్వాత అధ్యక్షుడైన రాహుల్‌గాంధీ తానుగా రాజీనామా చేశారే గాని ఎవరూ తొలగించలేదే? ఆపద్దర్మ అద్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన సోనియా ఈ సంక్షోభం వచ్చాకనే తాను పూర్తి స్థాయి అధ్యక్షురాలినని ప్రకటించారు కదా. పదవికి రాజీనామా చేసినా రాహుల్ ప్రియాంకలే నిర్ణయాలు తీసుకోవడం, సోనియా వారికే వత్తాసు పలకడం పరిపాటిగా మారింది. దారుణంగా చేజార్చుకున్న పంజాబ్‌నే తీసుకుంటే నవజ్యోత్ సింగ్ సిద్ధూ వంటి వివాదాస్పదుణ్ణి పిసిసి పీఠాధిపతిని చేయడం, వున్న ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను మార్చడం అన్నా చెల్లెళ్లు చేసిన పని కాగా, సోనియా కూడా సారీ చెప్పి పంపించారు. ఆయన విడిపోయి మరోపార్టీ పెట్టుకుని బిజెపితో కలసి పోటీచేసి ఓడిపోయారు. దళితుల ఓట్ల వస్తాయంటూ వీరు కొత్తగా పాలన అప్పగించిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండు చోట్లా వ్యక్తిగతంగానూ ఓడిపోగా దళితులు ఆప్‌కే ఓటేశారు. ఉత్తరాఖండ్‌లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఇంత తీవ్ర పరాజయాల తర్వాత కూడా ఆ పార్టీ అధిష్టానం సమీక్ష జరిపి బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్న మొక్కుబడి ప్రకటనలతో సరిపెడుతుంటుంది. 2014 ఓటమి తర్వాత నియమించిన ఆంటోని కమిటీ నివేదిక ఏమైందో ఇప్పటికీ తెలియదు. (ఇటీవల ఆయనే వయోభారంతో బాధ్యతలు విరమించుకున్నారు) 2019 ఎన్నికల అనంతరం 2020లో ఇలాగే హడావుడిగా జరిగిన వర్కింగ్ కమిటీ కంటితుడుపు చర్యలు ఏమైందీ తెలియదు. ఇప్పుడైనా ఇంతకన్నా భిన్నంగా ఏదో జరిగిపోతుందనే ఆశ ఆ పార్టీ నేతలకే లేదు. కాంగ్రెెస్ ఎంత బలహీనపడినా అంతర్గత కలహాలు మాత్రం తగ్గడం లేదనడానికి తెలంగాణనే ఉదాహరణ. ప్రజలు గెలిపించిన ఎంఎల్‌ఎలు చాలా మంది టిఆర్‌ఎస్‌లో కలిసిపోగా ఓడినవారిలో ప్రముఖులు బిజెపిలో చేరగా మిగిలిన వారు కీచులాటలలో మునిగితేలుతున్నారు.బిజెపిపై పోరాటం కన్నా టిఆర్‌ఎస్‌పై కత్తులు నూరడమే కర్తవ్యంగా వ్యవహరిస్తుంటారు.
నానాటికీ తీసికట్టు..
దాదాపు యాభై ఏళ్ల కిందట కాంగ్రెస్ బలహీనపడటం మొదలైన దశలో బంగ్లా కాంగ్రెస్, ఉత్కళ కాంగ్రెస్, కేరళకాంగ్రెస్ వంటివి ఏర్పడ్డాయి. ఆ తర్వాత కాలంలోనూ ఇందిరా కాంగ్రెస్, రాజీవ్ కాంగ్రెస్, శరద్‌పవర్ నేషనలిస్టు కాంగ్రెస్‌్, మూపనార్ తమిళమానిల కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ వంటివి ఏర్పడ్డాయి. విడిపోయిన చెన్నారెడ్డి, ఆంటోనీ, మూపనార్, అమరీందర్ సింగ్ వంటి రాష్ట్ర స్థాయి నేతలు మళ్లీ కలవడం, విడిపోవడం చాలా జరిగాయి. ప్రాంతీయ పార్టీలు వామపక్షాల సవాలుతో ఆ పార్టీ తమిళనాడులో 55 ఏళ్లుగా, బెంగాల్‌లో 45 ఏళ్లుగా, యుపి బీహార్‌లలో ముప్పై ఏళ్లుగా, ఒరిస్సా గుజరాత్‌లలో పాతికేళ్లుగా అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీలలో మళ్లీ గెలుస్తుందా అనే సందేహాలు వుండగానే పంజాబ్‌ను కూడా చేజార్చుకుంది. ఇది స్వయంకృతాపరాధమే అయినా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నట్టు అసలు ఆ పార్టీ పని అయిపోయిందని కొట్టిపారేయడానికి లేదు. ఇప్పటికీ 200 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ బిజెపితో ప్రధానంగా తలపడవలసివుంటుంది. కాంగ్రెస్, ప్రాంతీయ పాలకపార్టీలు ఆర్థిక రంగంలో ఒకే విధానాలు అనుసరించడం నిజం. బిజెపి మతతత్వ రాజకీయాలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్, కొన్ని ఇతర పార్టీలూ రాజీ పడటం నిజమే. అయినా బిజెపిని, వాటినీ ఒకే గాట కట్టడానికి లేదు. ఆ పేరిట కాంగ్రెస్‌తో రాజకీయ సంఘటన కూడా కుదిరేది కాదు. రాష్ట్రాలలో పరిస్థితులనూ కేంద్రంలో వచ్చే ఫలితాలను బట్టి నిర్ణయించుకోవాల్సివుంటుంది. చాలాసార్లు చెప్పుకున్నట్టు ఎన్నికల తర్వాత పరిస్థితులే బిజెపి వ్యతిరేక పొందిక తీరుతెన్నులు నిర్ధారిస్తాయి. 2024 లోక్‌్‌సభ ఎన్నికలకు ముందు కీలకమైన అనేక శాసనసభ ఎన్నికలూ రానున్నాయి. 2022 చివరలో గుజరాత్, హిమాచల్ ఎన్నికలు వుంటాయి. త్రిపురతో సహా మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు 2023 మార్చిలో వుంటాయి. మే, డిసెంబర్ మధ్య కర్ణాటక,చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ వంటి రాష్ట్రాల ఎన్నికలు వస్తాయి. ఇందులో చాలాచోట్ల కాంగ్రెస్ ఒక ముఖ్య శక్తిగా వుంది. వాటిలో ఆ పార్టీ జయాపజయాలు 2024లో దాని పాత్రను చాలావరకూ నిర్ధారిస్తాయి. కనుక నానాటికీ తీసికట్టుగా వున్న తమ పార్టీ పరిస్థితిని సరైన విధానాలతో సమిష్టిగా అధిగమించగలరో లేదో కాంగ్రెస్ నాయకులే తేల్చుకోవలసి వుంటుంది.
తెలకపల్లి రవి











