కాంగ్రెస్ గెలుపు దేశానికి చారిత్రక అవసరం- పిసిసి మీడియా చైర్మన్ ఎన్.తులసిరెడ్డి
రాజంపేట అర్బన్ : కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి రాహు కేతువుల్లా తయారయ్యారని పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆర్‌అండ్‌బి అతిథి గహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో దేశం అప్పులు పాలయిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేసి దేశాన్ని కార్పొరేట్లకు అమ్మివేస్తున్నాడని ఆరోపించారు. నిరుద్యోగం వికటాట్టహాసం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే 12 లక్షలు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. మణిపూర్ మండిపోతోందని ఆరోపించారు. దేశంలో దుశ్శాసన, కీచక పర్వాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను నిలువునా మోసగించిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రజలను వంచన చేయడంలో మోడీనే మించిపోయారని ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రౌడీలు రాజ్యమేలుతున్నారని, ఇసుక, గంజాయి, మైనింగ్‌తో పాటు మట్టిని కూడా వదలకుండా విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్‌గా, రుణాంధ్రప్రదేశ్ గా, అరాచక ఆంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, విశాఖ స్టీల్, రైల్వే జోన్, కడప ఉక్కు వంటి పరిశ్రమలతో పాటు దేశం అభివద్ధి పథంలో నడవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఆరు లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ, రూ.500కే వంట గ్యాస్, నిరుపేద కుటుంబాలకు నెలకు రూ.6 వేలు ఆర్థిక సాయం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు అధికారం చేపట్టాక ఏడాదిలోనే విభజన హామీలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. త్వరలోనే మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించి రానున్న ఎన్నికలలో రాహుల్ గాంధీని ప్రధానిగా గెలిపించేందుకు కషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్, సమన్వయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, కన్వీనర్ పూలభాస్కర్, సమన్వయ కమిటీ సభ్యులు ఎస్.ఎం.డి.గౌస్, జిల్లా కార్యదర్శులు ఓబులేసు, గంగాధర్, మైనార్టీ ఉపాధ్యక్షులు అబ్దుల్ అసూర్ పాల్గొన్నారు.










