Nov 18,2023 19:45

కాంగ్రెస్‌లోకి చేరుతున్న నేలతలమర్రి గ్రామస్తులు

ప్రజాశక్తి - దేవనకొండ
జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు డిసిసి అధ్యక్షులు బాబురావు, ప్రధాన కార్యదర్శి మహేంద్ర నాయుడు తెలిపారు. శనివారం మండలంలోని నేలతలమర్రి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు ఆ గ్రామ పెద్ద ఆర్‌ఎంపి వెంకట్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంక్షేమ పథకాల పేరుతో వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లను మూసివేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను వైసిపి ప్రభుత్వం అమలు చేస్తోందని, టిడిపి కూడా అదే ధోరణితో ఉందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసిలను ప్రధాని మోడీ ప్రయివేట్‌ పరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయమని, రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో పుంజుకుంటుందని తెలిపారు. జిల్లా కాంగ్రెస్‌ సహాయ కార్యదర్శి లాజరస్‌, మహిళ అధ్యక్షులు ప్రమీల, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షులు సుజాత, కార్యదర్శి రియాజ్‌, ఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి సుంకన్న, నగర అధ్యక్షులు గోవిందు, చిప్పగిరి కాంగ్రెస్‌ నాయకులు లక్ష్మీనారాయణ, మండల కాంగ్రెస్‌ నాయకులు మిరపకాయల శ్రీనివాసులు, హోటల్‌ కాసీం, కోడిగుడ్ల దస్తగిరి పాల్గొన్నారు.