Jul 10,2023 21:45

కార్యదర్శికి వినతి పత్రం అందిస్తున్న గిరిజన సంఘం నాయకులు

ప్రజాశక్తి - మక్కువ : మండలంలోని సీబిల్లి పెద్దవలస పంచాయతీ, కాముడువలస గ్రామానికి మంచి నీరు, కరెంట్‌ సౌకర్యం కల్పించాలని సోమవారం సీబిల్లిపెద్ద వలస సచివాలయం వద్ద ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల నాయకులు తాడంగి ప్రభాకర్‌ మాట్లాడుతూ సీబిల్లిపెద్ద వలస పంచాయితీలో గిరిజనులు కొత్తగా కాముడువలస దగ్గరలో గ్రామాన్ని నిర్మించు కొని 15ఏళ్లుగా కొండ పోడు వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. సాలూరు మండలం కొదమ పంచాయతీలో ఉన్న వీరు కొండపై సరైన వైద్య సౌకర్యాల్లేక అనారోగ్యం బారినపడితే మృత్యువాతపడడంతో ఆ కొండపై జీవించలేక కిందన గ్రామం ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. కొండ కిందకు వచ్చిన తర్వాత పోడు వ్యవసాయం, కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు అని అన్నారు, అయితే వీరికి తాగడానికి నీటి సౌకర్యం లేక గెడ్డనీటినే తాగి జ్వరాల బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్‌ సౌకర్యం లేక రాత్రి పూట పాములు, ఇతర విష పురుగుల బారినపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తక్షణమే ఈ గ్రామానికి మంచినీరు, విద్యుత్‌ కల్పించాలని కలెక్టర్‌ స్పందన కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవదేన వ్యక్తం చేశారు. పంచాయతీ సర్పంచ్‌, గ్రామ సచివాలయ కార్యదర్శిని కలిస్తే గిరిజనులకు ఓట్లు లేవని చెబుతున్నారని, ఓట్లు లేకపోతే మంచినీరు ఇవ్వరా అని ప్రభాకర్‌ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాముడు వలస గిరిజనులకు మంచినీటి బోరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని, లేకుంటే ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం ఎస్‌ పెద్ద వలస గ్రామ సచివాలయం కార్యదర్శి కొండ గొర్రి రామస్వామికి వినతిని అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం మండల నాయకులు దాడి చిన్నయ్య, గిరిజన సంఘం నాయుకులు బిరుసు, ఇతర గిరిజనులు పాల్గొన్నారు.