Feb 28,2023 22:55

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: నగరంలోని కామినేని హాస్పటల్స్‌ నందు హృద్రోగంతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు రోగులకు అరుదైన ఎంఐసిఎస్‌ సర్జరీలను విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పటల్‌ సీనియర్‌ కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ విశాల్‌ కాంటే తెలిపారు. హాస్పటల్‌ కాన్పరెన్స్‌ హాల్‌ నందు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరుకు చెందిన కరిచేటి లక్ష్మీనాగ వెంకటేశ్వరరావుకు మినిమల్లీ ఇన్వేసివ్‌ ఆఫ్‌ పంప్‌ సీఏబీజీ సర్జరీ చేసినట్లు తెలిపారు. అలాగే పెనమలూరుకు చెందిన కేతరాజు అరుణారావుకు ఎంవిఆర్‌ మినిమల్లీ ఇన్వేసివ్‌ కార్డియాక్‌ సర్జరీ చేసినట్లు తెలిపారు. రెండు సర్జరీలు కూడా విజయవంతంగా చేశామని రోగులు పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారని తెలిపారు. మినిమల్లీ ఇన్వేసివ్‌ కార్డియాక్‌ సర్జరీ ( ఎంఐసిఎస్‌ ) అనేది అత్యంత అధునాతన సర్జికల్‌ టెక్నిక్‌ అన్నారు. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలకు బదులుగా చిన్న కోతల ద్వారా సంక్లిష్ట గుండె సర్జరీలు చేయడంతో ముడిపడి ఉందన్నారు. సంప్రదాయక సర్జరీలతో పోలిస్తే ఎంఐసిఎస్‌ సర్జరీల నుండి అనేక ప్రయోజనాలున్నాయన్నారు వేగంగా కోలుకోవడం, తక్కువ గాట్లు, ఇన్ఫెక్షన్‌ రిస్కు తగ్గడం, ఆరోగ్య సంరక్షణ వ్యయాలు తగ్గడం, రోగులు సాదారణ పనులను త్వరగా చేసేందుకు వీలు కల్పించం లాంటివి ఈసర్జరీల ఉంటాయన్నారు. హాస్పటల్‌ సీఓఓ డాక్టర్‌ నవీన్‌ మాట్లాడుతూ ఇలాంటి సంక్లిష్ట సర్జరీలు అత్యంత ఖచ్చితత్వంతో చేయగలిగిన అత్యంత నైపుణ్యాలు కలిగిన బృందాన్ని కలిగి ఉన్నామని తెలిపారు. ఈసమావేశంలో సీనియర్‌ కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ భరత్‌, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎన్‌. పవన్‌కుమార్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ ఎం.వి. కళ్యాణ్‌ పాల్గొన్నారు.