Oct 24,2023 22:42

ప్రజాశక్తి-గుడివాడ : గుడివాడ నియోజకవర్గంలో పంట కాలువలకి పూర్తిగా నీరు విడుదల చేయాలని సిపిఎం గుడివాడ కార్యదర్శి ఆర్‌సిపి రెడ్డి డిమాండ్‌ చేశారు. గుడివాడ సుందరయ్య భవన్లో మంగళవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌ సి పి రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు వరి మొత్తం పొట్ట దశలో ఉంది కాబట్టి పుష్కలంగా నీళ్లు లేకపోతే పంట తప్పా తాలు వచ్చి పంట దిగుబడి తగ్గిపోతుందన్నారు. దీనివల్ల ఎక్కువ రైతు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఎక్కువగా నీటిని విడుదల చేయించి పంట కాలువలకు ఇవ్వాలని కోరారు. ఈ సంవత్సరం వర్షాలు కురిసినా సరిగ్గా రైతాంగానికి ఉపయోగపడలేదని చెప్పారు. ఇప్పటికీ ఇరిగేషన్‌ అధికారులు వంతులు వారీగా కాలువలకు నీరు ఇస్తున్నారని, శివారు భూములకు నీరు సరిపోవటం లేద దాని రీత్యా దిగుబడి తగ్గుతుంది కాబట్టి రైతు కూడా ఇంజన్లు పెట్టుకొని నీరు తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీని అదనపు భారం రైతు మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌతరం ఇరిగేషన్‌ లాకులు వద్ద పెడన నియోజకవర్గ ఎంఎల్‌ఎ జోగి రమేష్‌, ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావులు అవగాహనకు వచ్చి క్యాంపిబీల్‌, పోలరాజు కాలువలకు నీరు తీసుకోటానికి రాజీ కుదిరించారని, మిగిలిన గుడివాడ, పామర్రు నియోజకవర్గానికి నీటి సరఫరా పరిస్థితి ఏంటి అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఇరిగేషన్‌ అధికారులు పైనుంచి నీళ్లు ఎక్కువ వదిలించడం వాళ్ళకి సరఫరా చేసే ప్రయత్నం చేసి రైతు వ్యవసాయ సలహా కమిటీలు సమస్యను పరిష్కరించాలని సలహా కమిటీ సభ్యులు కషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఆర్‌ కొండ, పి రజిని తదితరులు పాల్గొన్నారు.