Jun 23,2023 01:37
మాట్లాడుతున్న మంత్రి నాగార్జున

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రైతులకు మేలు జరిగేలా సాగునీటి కాలువల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన అధికారులు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జల వనరుల సలహా మండలి సర్వసభ్య సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో జరిగింది. ఆయకట్టు భూములకు సాగునీరు అందించేలా అధికారులు ప్రణాళికతో పనిచేయాలని మంత్రి నాగార్జున చెప్పారు. రైతులకు అనుకూలంగానే అధికారులు పనిచేయాలన్నారు. గతంలో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల ముందుగానే సాగునీటిని విడుదల చేసిందన్నారు. పంటల సాగు కోసం రైతులు సమాయత్తమవుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పంట కాలువలు, చెరువుల గట్లు బలోపేతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద పనులను అనుసంధానిస్తూ కాల్వల మరమ్మతు పనులు చేస్తే మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. కాలువల పూడికతీత, తూటి కాడ, గుర్రపు డెక్క తొలగింపు, కాల్వల మరమ్మతు పనులు నేటికీ ప్రారంభించకపోతే గుత్తేదారులపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. క్షేత్రస్థాయిలో లస్కర్లు లేని విషయాన్ని అధికారులు గుర్తించి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా, చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌, డిఆర్‌ఓ కె లక్ష్మీశివజ్యోతి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ దశరథ మహారాజు, జల వనరులు, నీటి పారుదల కాలువల నిర్వహణ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.