Apr 30,2023 01:30
మట్టిని అక్రమంగా తవ్వుతున్న పొక్లెయిన్‌, తరలించేందుకు సిద్ధంగా టిప్పర్‌

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: బాపట్ల మండల పరిధిలోని గుడిపూడి గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ప్రొక్లైన్‌ల ద్వారా భారీ టిప్పర్లకు నింపి పక్క మండలాలకు తరలిస్తున్నారు. పనిలో పనిగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ట్రాక్టర్‌ మట్టి రూ.2 వేలు చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, సంబంధిత శాఖ ద్వారా పంచాయతీకి ఎటువంటి పత్రాలు అందలేదు. ఎక్కడైనా మట్టి తవ్వకాలు చేయాలంటే మైనింగ్‌ శాఖ ద్వారా అనుమతులు పొందాలి. ఈ విషయాన్ని పంచాయతీకి తెలిపి సంబంధిత పత్రాలు అందించాలి. అభ్యంతరాలు ఏమన్నా ఉంటే పంచాయతీ ద్వారా సరిచేసిన తర్వాతనే తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే అలాంటివేమీ లేకుండానే ఇక్కడ మట్టిని తవ్వేస్తున్నారు. వ్యవసాయ కాలువ అంచున కట్ట తవ్వడం వలన భవిష్యత్తులో కట్ట బలహీనపడి పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఏదేమైనా సంబంధిత అధికారులు అక్రమంగా చేస్తున్న తవ్వకాలపై గట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.