* నాలుగేళ్లుగా వంశధార నీరు అందని వైనం
ఖరీఫ్ వచ్చిందంటే రైతులందరి చూపూ వంశధార కాలువపైనే ఉంటుంది. ఈసారైనా నీరు రాకపోతుందా? మా పంటలు పండక పోతాయా? అని ఆత్రుతగా ఎదురుచూడడం రైతులకు పరిపాటి అయింది. పూర్తిస్థాయిలో వర్షాలు లేకపోవడం, కాలువ ద్వారా నీరు చేరకపోవడంతో శివారు ఆయకట్టు బీడుగా మారుతోంది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా నాలుగేళ్లుగా కాలువ కనీసం మరమ్మతులకు నోచుకోకపోవడంతో చుక్క నీరు రాక అధ్వానంగా మారింది. ఫలితంగా వేలాది ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది.
ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు: వంశధార ప్రధాన ఎడమ కాలువ 12 మండలాల్లోని 398 గ్రామాల పరిధిలో విస్తరించి ఉంది. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1,48,023 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాలువ నీరు 60 శాతం, వర్షం నీరు 40 శాతం కలిపి 2,480 క్యూసెక్కుల సాగునీరు అందాల్సి ఉంది. నందిగాం మండలం శివారు ప్రాంతం, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలు శివారు భూములుగా పిలవబడుతున్నాయి. ఈ పరిధిలో సుమారు 12 వేల ఎకరాలకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందాల్సి ఉంది. మూడు దశాబ్ధాల కిందట ఏర్పాటు చేసిన కాలువలు కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలువల్లో సుమారు రెండు మీటర్లు వరకు పూడికతో కప్పబడి ఉందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు కాలువ పరిధిలో గుర్రపు డెక్క నీటి ప్రవాహానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. ఖరీఫ్ ప్రారంభంలో వీటిని తొలగించడంతో పాటు రెండు మీటర్ల లోతున పూడిక తీయాల్సి ఉంది. 'రోమ్ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నారని' చరిత్ర పాఠంలో మాదిరిగా ఇక్కడ పాలకులు తయారైనారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు శ్రమదానం చేసి గుర్రపు డొక్క తొలగిస్తే వంశధార అధికారులతో కుమ్నక్కై బిల్లులు చేసుకున్న నాయకగణం ఉందని రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. పూడికలు యుద్ధ ప్రాతిపదికన తీస్తే తప్ప సాగునీరు శివారు భూములకు చేరడం ఈ ఏడాది కూడా గగనమే అంటూ రైతులు నిట్టూర్పు విడుస్తున్నారు. కనితివూరు 60 ఆర్ ఎల్ కాలువ ద్వారా వజ్రపుత్రుడు మండలంలో ఇరువైపుల వంశధార నీరు రావాల్సి ఉంది. కనితిఊరు నుంచి సీతంపేట మీదుగా ఉద్దానం గోపునాథపురం ఉద్దాన, మిరియాపుట్టి, పాతటెక్కలి, ఎస్.జె.పురం, పొల్లాడ మీదుగా దేవునల్తాడ వరకు 11 కిలోమీటర్లు. ప్రతాప విశ్వనాథపురం నుంచి మర్లపాడు మీదుగా ఉద్దానం కూర్మనాథపురం కొల్లిపాడు పెద్ద బొడ్డపాడు సీతాపురం కొండవూరు తీరపల్లి వరకు 60 ఆర్ ఎల్ కాలువ ఆరు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇప్పటివరకు ఈ కాలువ పూర్తిగా మరమ్మతులకు నోచుకోలేదు.
వేసవిలో కాలయాపన
వేసవిలో కాలయాపన చేస్తూ వచ్చిన వంశధార అధికారులు ఖరీఫ్ ముంగిట కాలువ గట్టుపై హడావుడి చేస్తారు. అధికారులలో చిత్తశుద్ధి కొరవడుతుంది. పూడికలు, గుర్రపు డొక్క, పిచ్చి మొక్కలు తొలగించకుండా శివారు భూములకు సాగునీరు ఎలా అందుతుంది. రైతులను దగా చేయడమే.
- చింత జయరాం, ఉద్దానం కూర్మనాథపురం
ఏటా ఇదేతంతు
గత నాలుగేళ్లుగా ఇదే తంతు. టెక్కలిపట్నం వద్దకు సాగునీరు వచ్చిందని ప్రచారం రావడంతో సంతోషంగా వెళ్లి చూశాం. నందిగాం మండలం జడ్యాడ వద్ద బందంగాయ చెరువు నిండితే చెరువు గండి పడుతుంది. నీరు వంశధార కాలువలోకి రైతులు విడిచి పెట్టారని తెలుసుకున్నాం. వంశధార నీరు అందించి రైతులను ఆదుకోవాలి.
- బగాది బాలకృష్ణ, గుల్లలపాడు










