Jul 13,2023 23:43

ఫార్మా కంపెనీలు బుధవారం రాత్రి విడుదల చేస్తున్న కాలుష్యం

ప్రజాశక్తి - పరవాడ
మండలంలోని జెఎన్‌ ఫార్మాసిటీలోని రాంకీ యాజమాన్యం సిఈటిపి ద్వారా చిమ్నీల్లో తీవ్రమైన కాలుష్యాన్ని వెదజల్లుతుందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ బుధవారం రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు ఫార్మా కంపెనీలు తీవ్రమైన కాలుష్యాన్ని వెదజల్లాయని, దీంతో ముక్కుమంట, కళ్ళు తిరగడం, వికారం వంటి లక్షణాలు సమీపంలో ఉన్న తానాం గ్రామంలో ఏర్పడిందని పేర్కొన్నారు. దీనిపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇఇకి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయగా, వారు వెంటనే స్పందించి రాత్రి 12 గంటల సమయంలో మిషన్‌తో పరీక్షలు నిర్వహించి కాలుష్యం వెదజల్లినట్లు నిర్ధారించారని తెలిపారు. రాంకీ యాజమాన్యం కాలుష్యం సిమ్నీల్‌ ద్వారా వదలడమే కాకుండా సమీపంలో ఉన్న ఊరచెరువులోకి రసాయానిక వ్యర్థ జలాలను విడిచిపెడుతుందని తెలిపారు. దీనివల్ల భూగర్భ జలాలు నాశనమవుతున్నాయని, నూతనంగా తవ్విన చెరువు వల్ల మరింత కాలుష్యం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. వెంటనే చెరువు మూసివేయాలని, కాలుష్యాన్ని అరికట్టాలని, రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గనిశెట్టి డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రాంకీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.