ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కాకినాడ రూరల్ పరిధిలో ఉన్న పలు పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. జల, వాయు కాలుష్యంతో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 23న కోరమండల్ ఎరువుల కర్మాగారం విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ జరగగా పలువురు కాలుష్యంపై తీవ్ర ఆవేదన వెలుబుచ్చారు. కోరమండల్ వంటి పరిశ్రమల వల్ల కాలుష్యం ఎక్కువగా ఉంటుందనేది ప్రజల్లో ఎప్పటినుంచో పలు అనుమానాలు ఉన్నాయని, జల, వాయు కాలుష్యం పెరిగిందని కాకినాడ రూరల్ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు సైతం ధ్వజమెత్తారు. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతం 13 మండలాల్లో 144 కిలోమీటర్లు విస్తరించి ఉంది. అనేక పరిశ్రమలు సాగరం వెంబడి వెలిసాయి. వాటి నుంచి నిత్యం వ్యర్థ జలాలు, రసాయనాలు సముద్రంలో కలుస్తున్నాయి. తీరం వెంట లక్షలాది మంది మత్స్యకారులు మత్స్య సంపద వేట వత్తిగా జీవనోపాధి పొందుతున్నారు. వీరి జీవనోపాధి కొన్నేళ్లుగా ప్రమాదంలో పడింది. కాకినాడ తీరంలో నిర్మించిన రెండు ఎరువుల పరిశ్రమలు, ఓడరేవు ఆధారంగా నెలకొల్పిన ఆయిల్ పరిశ్రమలు, సముద్ర గర్భం నుంచి సహజ వాయువులు వెలికి తీసే మూడు పరిశ్రమలు 26 ఏళ్లుగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. వీటి నుంచి వెలువడే విషవాయువులు, ప్రమాదకర వ్యర్థ రసాయనాలతో కొన్నేళ్లుగా తీరప్రాంతం అల్లకల్లోలంగా మారుతోంది. ఇక్కడ పర్యావరణం, సముద్రజలాల్లో మత్స్య సంపద, ఇతర జీవావరణాన్ని పూర్తిగా కలుషితం చేసేందుకు ఈ పరిశ్రమలే కారణమనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. పలు పరిశ్రమలు వ్యర్థాలను సముద్రంలోకి యథేచ్ఛగా వదిలేయడంతో మత్స్య సంపద ఉత్పత్తి నాశనం అవుతోందని పర్యావరణ వేత్తలు తరచూ ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు గానీ పట్టించుకోవడం లేదు.
మత్య్స సంపదకు గొడ్డలిపెట్టు
కాకినాడ రూరల్‌లో పలు పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, రసాయనాలు నేరుగా సముద్రంలో కలుస్తుండడంతో తీరం పూర్తిగా కలుషితమవుతోంది. దీంతో మత్య్ససంపద దెబ్బతింటోంది. దీంతో వేల మంది ఉపాధిని కోల్పోతున్నారు. చేపల వేట తప్ప ఇతర వత ు్తలు తెలీని పలు మత్య్సకార కుటుంబాలు తమ జీవనాన్ని కోల్పోతున్నాయి. మరో ప్రత్యామ్నాయం లేక సతమతమవుతున్నారు. పూర్వం నుంచి మత్స్యకారులు వంశపారంపర్యంగా సముద్ర తీరానికి ఆనుకుని జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా మత్స్య సంపద గణనీయంగా తగ్గి ఉపాధిని కోల్పోయి కుటుంబాల పోషణ కష్టంగా మారిందని పలువురు మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోగాల బారిన స్థానికులు
కాకినాడ రూరల్ మండలం వాకలపూడి, వలసపాకల గ్రామాల్లో ఉన్న రైస్‌బ్రాన్ ఆయిల్ ఫ్యాక్టరీలు వదిలి పెడుతున్న పలు రకాల రసాయన మిళిత పొగవల్ల స్థానికులు కంటి చూపు కోల్పోతున్నారు. ఇప్పటికే కొందరు కంటి చూపు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. కెమికలైజ్డ్ పొగ గాల్లో కలుస్తుండడంతో శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. పొగ తీవ్రత తగ్గించి, గాల్లోకి వదిలేటప్పుడు ఫ్యాక్టరీల యాజమాన్యాలు పర్యావరణ శాఖకు ఇచ్చిన అపిడవిట్‌లో నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలు కొన్ని సందర్భాల్లో వదిలే పొగ పరిసర ప్రాంతాల్లో పది కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుండడంతో ఘాటైన వాసన పీల్చుతున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
పట్టించుకోని యంత్రాంగం
పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడకుండా చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖలు చోద్యం చూస్తున్నాయి. ఆరోగ్యరక్షణపై ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. కోస్తాలో జరుగుతున్న ఈ విధ్వంసం, వినాశనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనీస స్పందన లేకపోవడం చూస్తుంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఆందోళనలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.










