Apr 28,2023 21:12

సదస్సులో మాట్లాతున్న గోవర్థనరావు, తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు : వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు హైడ్రోజన్‌ ఎంతగానో దోహదపడుతుందని ఆర్‌విఆర్‌ అండ్‌ జెసి ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యక్షులు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ అన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీర్స్‌-అమరావతి రీజియన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు 'హైడ్రోజన్‌ - కెన్‌ ఇట్‌ బి ఏ సేవియర్‌ అఫ్‌ ది ఎర్త్‌ ఫ్రం గ్లోబల్‌ వార్మింగ్‌' అంశంపై జాతీయ స్థాయి సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ప్రొఫెసర్‌ గణపతి యాదవ్‌ ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొని హైడ్రోజన్‌ ప్రాధాన్యంపై మాట్లాడారు. వాతావరణంలో కాలుష్య నివారణకు హైడ్రోజన్‌ దోహదపడే తీరును వివరించారు. 2070 నాటికి భారతదేశం కాలుష్య రహిత వాతావరణ సమాజం ఏర్పాటులో హైడ్రోజన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. హైడ్రోజన్‌ వాతావరణంలో ఎక్కువ శాతం అంతర్లీనం అయివుందని, దానిని సేకరించి ఉపయోగించుకోవడం ద్వారా ఉష్ణోగ్రతలో మార్పులను సమతుల్యం చేయొచ్చన్నారు. దీంతోపాటు వాహనాలకు, ఫ్యాక్టరీలకు, ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లకు వాడే పెట్రోల్‌, డీజిల్‌, బొగ్గు, వంటి వాటికి బదులు హైడ్రోజన్‌ వల్ల ఉత్పత్తి అయ్యే ఇంధన శక్తిని వాడటం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా నివారించవచ్చని వివరించారు. అమరావతి రీజియన్‌ సెంటర్‌ చైర్మన్‌ డాక్టర్‌ వి.గోవర్ధన్‌రావు మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ కిరోసిన్‌ ఇంధన శక్తి కంటే హైడ్రోజన్‌ శక్తి మూడురెట్లు ఎక్కువ సామర్ధ్యం కలిగి ఉందన్నారు. ప్రకృతి విపత్తులు వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంటాయని, వాటిని అధిగమించే దిశగా విద్యార్థులు పరిశోధనలు చేయాలని కళాశాల సెక్రటరీ అండ్‌ కరెస్పాండెంట్‌ రాయపాటి గోపాలకృష్ణ సూచించారు. కళాశాల ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళిమోహన్‌, కళాశాల ట్రెజరర్‌ డాక్టర్‌ కొండబోలు కృష్ణప్రసాద్‌ ప్రసంగించారు. ఆర్‌అండ్‌డి డైరెక్టర్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బోర్డు మెంబర్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌వి రామ్‌కుమార్‌ ఆన్‌లైన్‌ ద్వారా సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్‌ సి.వి.వి.సత్యన్నారాయణ , డాక్టర్‌ జి.రంగారావు, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కొల్లా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.