Apr 24,2023 23:38

జివిఎంసికి ఆటోలో వచ్చిన మేయర్‌ హరివెంకటకుమారి

జివిఎంసికి ఆటోలో చేరుకున్న మేయర్‌
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ :
కాలుష్య నియంత్రణకు అన్ని వర్గాలూ సహకరించాలని మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. జీవీఎంసీ తీసుకున్న నిర్ణయం మేరకు ఆమె తన సొంత వాహనం వదిలి ఆటోలోనే జివిఎంసి ప్రధాన కార్యాలయానికి చేరుకొని 'డయల్‌ యువర్‌ మేయర్‌', 'స్పందన' కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలూ ముగించుకుని విద్యుత్‌ వాహనంలో తిరిగి ఆరిలోవని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వారానికి ఒకరోజ్కెనా అందరూ తమ వాహనాల్ని పక్కన పెట్టి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగుల, అధికారులు తీరుపై ఆగ్రహం
మేయర్‌ ఆటోలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నప్పుడు చుట్టుపక్కల భారీ స్థాయిలో ఉద్యోగులు, అధికారుల వాహనాలు పెట్టేయడంపై ఆమె మండిపడ్డారు. ఉద్యోగులు, అధికారులు తమ సొంత వాహనాల్ని వదిలి ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని జీవీఎంసీ తీసుకున్న నిర్ణయాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో ఒకరోజు బస్సు, ఆటో, సైకిల్‌పైనే జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి ఉద్యోగులు చేరుకోవాలని, అలా కాని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.