Jul 18,2023 21:34

మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : పర్యావరణాన్ని కాపాడేందుకు జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణకు జిల్లా పర్యావరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పర్యావరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, కావున పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సూచించిన ప్రమాణాల మేరకు సంబంధిత శాఖల అధికారులు, ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇంటి నుంచి వచ్చే చెత్త, మున్సిపాలిటీలు, పంచాయతీలలో ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌ చెత్త నిర్వహన, భవన నిర్మాణాలు, పాత ఇళ్లు పడగొట్టడం వల్ల వచ్చే మెటీరియల్‌, ఆసుపత్రుల నుంచి వచ్చే బయో మెడికల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల వ్యర్థాలు, పరిశ్రమలు నుంచి వచ్చే కాలుష్యం, నీటి నాణ్యతకు ప్రణాళిక, మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు తదితర అంశాలపై ఈ నెలాఖరుకు జిల్లా పర్యావరణ ప్రణాళిక తయారుచేసి శాఖల వారీగా నివేదిక పంపాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. వాయు, శబ్ద కాలుష్యానికి సంబంధించి మొబైల్‌ ల్యాబ్‌ ద్వారా పట్టణంలో డాటా సేకరించాలన్నారు. గాలి నాణ్యత పరీక్షించేందుకు శాశ్వతంగా పాత బస్టాండు, ఆర్‌టిసి బస్టాండ్ల వద్ద పరికరాలు ఏర్పాటు చేయాలని కాలుష్య నియంత్రణ అధికారులను ఆదేశించారు. బయో మెడికల్‌ వ్యర్ధాలను శాస్త్రీయంగా వేరుచేసి, ఆసుపత్రి ఆవరణలో నిల్వ చేసే ప్రదేశంలో కెమెరాలు అమర్చి వాటిని కాలుష్యనియంత్రణ మండలి వారికి పర్యవేక్షణ కోసం అనుసంధానం చేయాలని తెలిపారు. జిల్లాలో గల ఆసుపత్రులలో బయో వ్యర్థాల నిర్వహణ ఏర్పాట్లను, అనుమతులను తనిఖీ చేయాలన్నారు. ఆసుపత్రుల్లో రోజువారీ పడకల వివరాలు, వాటి వల్ల ఉత్పన్నమైన వ్యర్ధాలను శాస్త్రీయంగా వేరు చేసి, తదుపరి వాటిని రెయిన్బో ఇండిస్టీ వారికి అందజేయాలన్నారు. వీటి వివరాలను కూడా ఆసుపత్రి వారు వెబ్సైటులో నమోదు చేయాలని ఆదేశించారు. బయో మెడికల్‌ వ్యర్ధాలను మున్సిపల్‌ వ్యర్ధాలతో జతచేయకుండా పర్యవేక్షించాలని వైద్యశాఖాధికారులకు సూచించారు. కాలుష్య నియంత్రణ బోర్డు ఇఇ ఎంవి పద్మావతి మాట్లాడుతూ మున్సిపాల్టీ, వైద్య ఆరోగ్య, గనులు పరిశ్రమల శాఖాధికారులు ప్రణాళిక తయారు చేయాలని కోరారు. దీనిలో భాగంగా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌, సి అండ్‌ డి వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌, బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక, ఈ-వేస్ట్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌, నీటి నాణ్యత నిర్వహణ ప్రణాళిక, గృహ మురుగు నిర్వహణ ప్రణాళిక, పారిశ్రామిక మురుగునీటి నిర్వహణ ప్రణాళిక, ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌, మైనింగ్‌ కార్యకలాపాల నిర్వహణ ప్రణాళిక, శబ్ద కాలుష్య నిర్వహణ ప్రణాళికలకు సంబంధిత శాఖలు నివేదికలు ఈనెల 25 నాటికి అందజేయాలన్నారు. సమావేశంలో డిపిఒ బి.సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇఇ ఒ.ప్రభాకరరావు, మున్సిపల్‌ కమిషనర్లు జె.రామప్పలనాయుడు, ఫరీరురాజు, ఇరిగేషన్‌ ఎస్‌ఇ, డిప్యూటీ డిఎంహెచ్‌, భూగర్భ గనులు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.