ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం
ఎన్‌టిటిపిఎస్ ఎన్విరాన్మెంట్ ఈఈ బాబురావు షాబుఖారి బాబా దర్గా మసీదు ప్రాంగణాన్ని సందర్శించారు. ఎన్టీపీఎస్ కాలుష్యం వల్ల కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హజ్రత్ సయ్యద్ షాబుఖారి దర్గాకు వచ్చే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదు మేరకు షాబుఖారి బాబా దర్గా, మసీదు ప్రాంగణం పరిశీలించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలుష్యంతో దర్గా ప్రాంగణమంతా నల్లగా అయిపోతుందని, మసీదులో కనీసం నమాజ్ చేసుకునేందుకు కూడా యాత్రికులు ఇబ్బంది పడుతున్నారని, సిబ్బందికి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఈఈకి విన్నవించారు. అదే విధంగా వెంటనే చెట్లు నాటించాలని, దర్గా మసీదులో పనిచేసే సిబ్బందికి, ముతవల్లీలకు, ఇమామ్‌లకు హెల్త్‌కార్డ్ ఇవ్వాలని, షెడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఈఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, త్వరలోనే కాలుష్య నివారణకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా, దర్గా ముతవల్లి షాజహాన్ బాబు, కాజా తదితరులు పాల్గొన్నారు.










