పూసపాటిరేగ: పరిశ్రమ వ్యర్థాల కోసం పైపులైన్లు ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జలాలు కాలుష్యమై తమ పంట పొలాలు నాశనం అవుతున్నాయని కొణతాలపాలెం గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చౌడువాడ పంచాయతీలో కొణతాలపాలెంగెడ్డలో నుంచి సముద్రం వరకు శ్రేయస్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న వ్యర్థ జలాల పైపులైను పనులను చౌడువాడ ఎంపిటిసి భర్త పసుపులేటి గోపి ఆధ్వర్యంలో కొణతాలపాలెం గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. గతంలో వేసిన వ్యర్థాల పైప్‌లైన్లు లీకై తమ ప్రాంతమంతా భూగర్భ జలాలు కలుషితమై తాగునీరు లేదని గ్రామస్తులు వాపోయారు. ఎంపిటిసి సభ్యులు సొంత నిధులతో కోనయ్యపాలెం నుండి మూడు కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి పైప్‌లైన్ ద్వారా నీరు అందిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ గెడ్డలో నుండి వ్యర్థాల పైప్‌లైన్లు వేస్తే తమ బతుకులు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పసుపులేటి గోపి మాట్లాడుతూ భారీ పైపులైను గ్రామ సమీపంలో వేయడం వల్ల గ్రామమంతా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు భూగర్భ జలాలను కలుషితం చేసి, కనీసం తాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయలేకపోవడం విచారకరమన్నారు. గెడ్డ మీదుగా రహదారి వేయాలని చూస్తే ఇప్పటికే కోర్టులో స్టే కూడా తెచ్చి నిలుపుదల చేశామన్నారు. ఇప్పుడు మళ్లీ వ్యర్థాల కోసం పైపులైను ఏర్పాటు చేయడం దారుణమన్నారు. గ్రామస్తుల ఆందోళనతో పైప్‌లైన్ పనులను నిర్వాహకులు ఆపేశారు. దీంతో గ్రామస్తులంతా వెనుదిరిగారు. కార్యక్రమంలో పంచాయతీ వార్డు మెంబర్లు కోరాడ రమణ, మొంగం మోహన్ రావు, గ్రామస్తులు కొణతాల అప్పలనాయుడు, సురేష్, అప్పయ్యమ్మ, రాములమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు










