Dec 26,2022 00:02

ఫ్లైవుడ్‌ కంపెనీ నుంచి వెలువుడుతున్న కాలుష్యం

ప్రజాశక్తి-ఆనందపురం : ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల గ్రామాలతో పాటు పలు విద్యాలయాలు కాలుష్యంలో చిక్కుకుంటున్నాయి. దీంతో విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ యజమానులు నిబంధనలు పాటించకుండా దట్టమైన పొగ విడిచిపెడుతుండటంతో కర్మాగారం చుట్టూ ఉండే విద్యాలయాల విద్యార్థులు, గ్రామస్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వెల్లంకి బొడ్డపాలెం హార్బర్‌ స్కూల్‌, వెల్లంకి జగనన్న కాలనీ, వెల్లంకి హైస్కూల్‌, ప్రాథమిక పాఠశాల, గారిపేట, బోయపాలెం, వేములవలస గ్రామాల నడుమ సుమారు 20 కంపెనీలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ప్లైవుడ్‌, ఐరన్‌, కంపెనీల నుంచి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన పొగ వెలువుడుతుండటంతో వాతావరణం కలుషితమవుతోంది.
ప్లైవుడ్‌ కంపెనీలో బాయిలర్‌లో వేసిన ప్లైవుడ్‌ చెక్క గమ్ముతో కూడుకొని ఉండడంతో మంటపేట్టేటప్పుడు అధిక పొగ వెలువుడుతోంది. ఈ కంపెనీల సమీపంలోని పాఠశాలల విద్యార్థులు, నివాస గృహాల ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ కంపెనీలపై అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.