ప్రజాశక్తి-హిందూపురం : విఒఎల ఉపాధిని దెబ్బతీసే 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యూలర్‌ను రద్దుచేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన యానిమేటర్స్ జనరల్ బాడీ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు అంశాలపై వారు చర్చించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎపిఎం రామకృష్ణకు అందజేశారు. ఈ సందర్బంగా ఇఎస్ వెంకటేష్ మాట్లాడుతు ఒహెచ్‌ఆర్ పాలసీ అమలు చెయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నిరకాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విఒల మెడ్జి చేయటంవలన వేలాది మంది విఒలకు ఉపాధి పోతుందన్నారు. ఇది మానవ వనరులకు విఘాతం కలిగించటమే అవుతుందన్నారు. ఇప్పటి వరకు 15 సంఘాల లోపు ఉన్న విఒల విఒఎలకు వేతనాలు చెల్లించలేదన్నారు. విఒఎలుగా ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి, వయసు పై బడిన వారికి, అనారోగ్యంతో ఉన్న వారి కుటుంబ సభ్యులకు విఒఎలుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, యూనియన్ కార్యదర్శి కిష్టప్ప, కోశాధికారి హరీష్ బాబు, నాయకులు బైలప్ప, సుజాత, సుగుణ తదితరులు పాల్గొన్నారు.










