Oct 10,2023 22:10

ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌

     అనంతపురం కలెక్టరేట్‌ : యానిమేటర్లు(విఒఎ)ల ఉపాధిని దెబ్బతీసేలా విధించిన మూడు సంవత్సరాల కాలపరిమితిని వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నాగమణి, ఎస్‌.నాగేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. విఒఎల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. విఒఎ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరి అధ్యక్షతన నిర్వహించిన ధర్నాకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.బాలరంగయ్య, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి మద్దతుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి మాట్లాడుతూ గ్రామాల్లో విఒఎలు ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఇంత కష్టపడి పని చేస్తున్నా వారికి పనికి భద్రత లేదన్నారు. ప్రభుత్వం స్పందించి వారికి భద్రత కల్పించాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య మాట్లాడుతూ గ్రామ సమాఖ్యల అనుసంధానం నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. విఒఎలను అనుసంధానం చేయడం ద్వారా వేలాది మంది విఒఎలు ఉపాధికి దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ విఒఎల ఉపాధికి నష్టం చేకూర్చే మెర్జ్‌ నిర్ణయాన్ని ఆపాలన్నారు. ఎక్కువ సంఘాలున్న విఒఎల నుంచి తక్కువ సంఘాలున్న విఒఎలకు సర్దుబాటు చేయాలన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. 15 సంఘాల్లోపు ఉన్న విఒఎలకు వేతనాలు చెల్లించలేదన్నారు. విఒఎలుగా ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం.నాగమణి మాట్లాడుతూ విఒఎలకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలన్నారు. కాల పరిమితి సర్య్కూలర్‌ రద్దు చేయాలన్నారు. అనంతరం డిఆర్‌ఓ గాయత్రిదేవిని కలిసి వినతి పత్రం అందజేశారు.