Apr 20,2023 22:38

జెడ్‌పి సమావేశంలో ఇళ్లస్థలాల సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు ఏకరువు
లేఅవుట్‌ల్లో పూడిక, రోడ్లు, డ్రెయినేజీ సమస్యలపై ఆవేదన
కోర్టులో ఉన్న స్థలాల సమస్యపై అసంతృప్తి
ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలి: కలెక్టర్‌
పలు తీర్మానాలను ప్రవేశపెట్టిన జెడ్‌పి చైర్మన్‌ కవురు
తూతూమంత్రంగా సాగిన జెడ్‌పి సర్వసభ్య సమావేశం
కవురుకు అధికారులు, ప్రజాప్రతినిధుల వీడ్కోలు,శుభాకాంక్షలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

జగనన్న కాలనీల్లో నెలకొన్న ఇళ్లస్థలాల పూడిక, రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు వంటి సమస్యలను పరిష్కరించాలని జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ అధ్యక్షతన గురువారం జరిగిన ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు ఏకరువు పెట్టారు. 60, 70 శాతం ఇళ్లు పూర్తయిన కాలనీల్లోనూ రోడ్లు, డ్రెయిన్ల సమస్యలు పరిష్కరించలేదన్నారు. పట్టాలిచ్చి కోర్టులో ఉన్న స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించకపోతే లబ్దిదారుల నుంచి తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయన్నారు. కైకలూరు నియోజకవర్గంలో 43 లేఅవుట్ల పూడిక ఇప్పటికీ జరగలేదన్నారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ జిల్లాలో నాడు-నేడు తదితర పనుల నాణ్యతను పరిశీలించేందుకు జెడ్‌పిటిసి, ఎంపిపి, తహశీల్దారు, ఎంపిడిఒలతో కూడిన బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును, అంగన్వాడీలను పరిశీలించాలని సూచించారు. ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తే పనుల్లో మంచి ప్రగతి కన్పించడమే కాకుండా క్షేత్రస్థాయిలో సిబ్బందిలో కొద్ది భయం ఉంటుందని చెప్పారు. కనీసం నెలకు రెండుసార్లు ఈ బృందం తనిఖీలు చేపట్టాలన్నారు. స్పందనలో వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారం బాగా జరుగుతుందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం చేపడుతున్న సందర్బంలో స్పందనలో పరిష్కార తీరులో అసంతృప్తి ఉంటే తెలియజేయవచ్చని, పరిశీలన అనంతరం సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. స్పందనలో ఎక్కువగా 25 శాతం వ్యక్తిగత భూసమస్యలు వస్తున్నాయని వివరించారు. ఇటువంటి సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల ద్వారా పరిష్కారమయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. రబీ ధాన్యం సేకరణకు సంబంధించి ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. ఎకరాకు 92 గోనె సంచులు అందిస్తున్నామని, పంటకోత ప్రయోగాల ద్వారా దిగుబడి అంచనా వేసి ఇది నిర్ణయించామని తెలిపారు. వంద సంచులు ఇవ్వాలని డిమాండ్‌ ఉందని, అయితే రైతులు తమ చేతిలో ఉన్నపంటను ముందుగా ఇచ్చేలా అవగాహనపర్చాలన్నారు. గోనె సంచుల సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రవాణా సౌకర్యానికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం అందిస్తే రబీ ధాన్యం సేకరణ సజావుగా పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామన్నారు. గత ఖరీఫ్‌లో 21 రోజులకే సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రతి మండలంలో కనీసం 4,5 చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపిడిఒలు, తహాశీల్దార్లకు సూచించామన్నారు. ఉపాధి హామీ కింద పలు ప్రభుత్వ ప్రాధాన్యతా నిర్మాణాలు చేపట్టామని, కొన్ని భవనాలు 95 శాతం నిర్మాణ పనులు పూర్తిచేసుకొని తుదిదశలో ఉన్నాయని, వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసు కొచ్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధుల చొరవ ఎంతైనా అవసరమన్నారు. జిల్లాలో రీసర్వేపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. భూమి వివరాల్లో వ్యత్యాసాలు ఉంటే గ్రామ సభలో తెలియపర్చవచ్చని, రికార్డులో పేరు తప్పు పడితే 21 రోజుల్లో అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉందని అన్నారు. గృహనిర్మాణానికి సంబంధించి జిల్లాలో ప్రగతి బాగానే ఉందన్నారు. ప్రతి శనివారం హౌసింగ్‌ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల కాలనీల్లో అవసరమైన తాగునీరు, విద్యుత్‌ సరఫరా పనులు జరుగుతున్నాయన్నారు. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులను ఇళ్ల నిర్మాణ అనంతరం వేగంగా చేపడుతున్నట్లు తెలిపారు.
పలు తీర్మానాలు ఆమోదం
జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ పలు తీర్మానాలను పెట్టి సభ ఆమోదం కోరారు. జిల్లా పరిషత్‌ సిబ్బందికి సంబంధించి ఉద్యోగులను, కుటుంబాలను ఆదుకునేందుకు జెడ్‌పి సాధారణ నిధుల నుండి వార్షికంగా రూ.15 లక్షలు ఇన్సూరెన్స్‌ సొమ్మును కంపెనీకి చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. జెడ్‌పి కార్యాలయం నుండి గ్రామ పంచాయతీ పింఛనుదారులు 230 మందికి, జెడ్‌పి పింఛనుదారులు 26 మందికి వెరసి మొత్తం 256 మందికి పింఛను చెల్లిస్తున్నట్లు ఈ ఆర్థిక సంవత్సరం నుండి పింఛను చెల్లింపు నిమిత్తం రూ. ఆరు కోట్లు బడ్జెట్‌ జెడ్‌పి సాధారణ నిధుల కేటాయించనున్నట్లు తెలిపారు. ఎరియర్‌ సొమ్ము ప్రభుత్వం నుండి విడుదలయ్యాక పింఛనుదారులకు సొమ్ము చెల్లించుటకు చర్యలు తీసుకుంటామన్నారు. తాను జెడ్‌పి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో అన్నివిధాలా ఆదరించి ముందుకు నడిపించిన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులకు కవురు శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే నా చివరి సమావేశం అని పేర్కొన్నారు. ఏ జిల్లాలో చేయనివిధంగా ప్రతి జెడ్‌పిటిసికి అభివృద్ధి పనులకు రూ.కోటి కేటాయించినట్లు వివరించారు. ఎంఎల్‌సిలు జయమంగళ వెంకటరమణ, షేక్‌ సాబ్జీ, గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు పలు సమస్యలను లేవనెత్తారు. సమావేశంలో జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్‌, పలువురు జెడ్‌పిటిసిలు పాల్గొన్నారు. ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ను శాలువాతో అధికారులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు.
జెడ్‌పి అధికారుల రూటే వేరు..
జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహణాతీరును జెడ్‌పి అధికారులు అందుకు విరుద్ధంగా మార్చేశారు. ఏదో సమావేశం పెట్టాలనే రీతిలో తూతుమంత్రంగా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎజెండా అంశాలకు సంబంధించిన కాపీలను సభ్యులకు అందించడం పూర్తిగా వదిలేశారు. గతంలో పుస్తకం రూపంలో ఎజెండా అంశాలు, వివరాలు పొందుపరిచి సభ్యులకు, మీడియాకు ఇచ్చేవారు. గడిచిన రెండు, మూడు సమావేశాల నుంచి దీనికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చేశారు. పథకాలకు సంబంధించిన సమాచారం తెలియకుండా ఈ విధంగా చేస్తున్నారా అనే అనుమానాలు నెలకొన్నాయి. వారు చెప్పిందే ఎజెండా అన్నట్లు తయారైంది. ఎజెండాలో పేర్కొన్న ఒకటి, రెండు అంశాలకే సభ పరిమితమవుతోంది. గతంలో జెడ్‌పి సమావేశానికి మంత్రులు, ఎంఎల్‌ఎలంతా హాజరయ్యేవారు. గత కొన్ని సమావేశాలనుంచి మంత్రులు, ఎంఎల్‌ఎలు కనీసం రావడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి కలెక్టర్‌గాని, జెసిగానీ రాకపోవడంపై సభ్యులుసైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. గురువారం సమావేశానికి గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు, ఎంఎల్‌సిలు షేక్‌ సాబ్జీ, జయమంగళ వెంకటరమణ మాత్రమే హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం అనంతరం సమావేశం జరుగుతుందని, సమస్యలపై చర్చలు ఉంటాయని చెప్పడంతో సభ్యులంతా వచ్చి ఆశీనులయ్యారు. అయితే సమావేశం జరగలేదు. కనీసం సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకపోవడంపై అంతా అసహనం వ్యక్తం చేశారు. జెడ్‌పి సమావేశం తీరుతెన్నులను పూర్తిగా మార్చేస్తున్న జెడ్‌పి అధికారుల తీరు సభ్యుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.