కాలనీలో నిలిచి ఉన్న మురుగు
ప్రజాశక్తి - హోళగుంద
మండలంలోని వందవాగిలి బీసీ కాలనీలో మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ప్రజల రాకపోకలు, వాహనాలు సంచరిస్తున్నాయి. మురుగు నీరు నిలిచి ఉండడం వల్ల దోమలకు ఆవాసంగా మారింది. అలాగే దుర్గంధం వెదజల్లుతుండంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని మాజీ సర్పంచి నాగప్ప, వాలంటీర్లు తిమ్మప్ప, హనుమేష్, వెంకటేష్, నీలగిరి ఈరన్న మంగళవారం పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు, గ్రామ కార్యదర్శికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని మురుగునీరు రోడ్డుపై నిలబడకుండా చూడాలని, చెత్తాచెదారం పూడికతో నిండిపోయిన డ్రెయినేజీకి మరమ్మతులు చేపట్టి, పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.










