Aug 19,2023 22:11

మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - జలుమూరు: 
జగనన్న కాలనీలకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని చల్లవానిపేట, లింగాలవలస జగనన్న కాలనీలను శనివారం పరిశీలించి, లబ్ధిదారులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలో రోడ్లతో పాటు మెయిన్‌ రోడ్డు నుంచి కాలనీకి వచ్చేందుకు రోడ్డు బాగా లేదని, తాగునీటికీ ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. కాలనీలో గ్రావెల్‌ రోడ్లతో పాటు మెయిన్‌ రోడ్డు నుంచి కాలనీకి వచ్చేందుకు బిటి రోడ్డు వేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. జంగిల్‌ క్లియరెన్స్‌, పారిశుధ్య పనులు చేయించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. తాగునీటి సమస్యను మూడు రోజుల్లోగా పరిష్కరించాలని అందించాలని ఆదేశించారు. మళ్లీ తాను వస్తానని, అప్పటికి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం జోణంకి పంచాయతీలో రెండో వార్డుకు నిర్వహిస్తున్న ఎన్నికను పరిశీలించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ పీడీ ఎన్‌.గణపతిరావు, తహశీల్దార్‌ బి.సత్యం, ఎంపిడిఒ ఎల్‌.వి అప్పారావు, హౌసింగ్‌ ఇఇ కె.అప్పారావు, ఇఒపిఆర్‌డి పి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.