Sep 05,2021 13:23

అప్పుడే కడుపు నిండా మెక్కిన కొండ చిలువలా నెమ్మదిగా జూబ్లీ హిల్స్‌ మెట్రో స్టేషన్‌లోకి వచ్చి ఆగింది ట్రైన్‌.
మంత్రం వేస్తే తెరుచుకున్నట్టు దాని తలుపులు వాటంతట అవే ఆటోమేటిగ్గా తెరుచుకున్నాయి. పీక్‌ అవర్‌ కావడంతో చాలామందినే మింగినట్టుంది. లోపల జనం కిటకిటలాడుతున్నారు. దిగాల్సిన వాళ్లు దిగగానే నేను నాతో పాటూ ఉన్న కొంతమంది ప్రయాణికులు భోగిలోకి ఎక్కాం.
లోపలికి వెళ్లడానికి చోటులేక డోర్‌ దగ్గరే హోల్డర్ని గట్టిగా పట్టుకుని నిలబడుకున్నాను నేను. ట్రైన్‌ కదిలింది. డోర్‌కి ఉన్న అద్దాల కిటికీలోంచి బయటకు చూస్తుంటే సాయం సంధ్య వెలుగులో హైదరాబాద్‌ నగరం సుందరంగా కనిపిస్తోంది. ఎటువైపు చూసినా నారింజ రంగు కాంతితో మెరిసిపోతోంది. కెమెరాకి ఆరెంజ్‌ కలర్‌ ఫిల్టర్‌ అమర్చి తీసిన విజువల్‌ ఎలా ఉంటుందో సేమ్‌ అలానే ఉందా దృశ్యం. కన్నార్పకుండా ఆ అందాన్ని తనివితీరా ఆశ్వాదిస్తున్న నాలో ఏవేవో ఆలోచనలు.
సినిమా డైరెక్టర్‌ అవ్వాలని హైదరాబాద్‌కి వచ్చి అప్పుడే నాలుగేళ్లు అయిపోయింది. ఈ నాలుగేళ్లలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం రావడానికే రెండేళ్లు పట్టింది నాకు. ఆ చేతకాని డైరెక్టరేమో సంవత్సరం తీశాడా సినిమా. అనుకున్నట్టుగానే అది ప్లాప్‌ అయ్యింది. దాంతో కోపం వచ్చిన ప్రొడ్యూసర్‌ కేటాయించిన దానికంటే ఎక్కువ బడ్జెట్‌ ఖర్చు పెట్టి సినిమా తీసి, తనని నష్టాలు పాలు చేసిన ఆ డైరెక్టర్‌ని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సాయంతో తెలుగులో ఇక మీదట ఎటువంటి సినిమాలూ తీయనీకుండా బ్యాన్‌ చేయించాడు.
ఇనుముతో చేరినందుకు నిప్పులకు కూడా సుత్తి దెబ్బలు తప్పవన్నట్టు అతనితో పని చేసినప్పటి నుంచీ నాకూ ఎదురు దెబ్బలకు కొదవ లేకుండా పోయింది. ఏ ప్రొడ్యూసర్‌ కైనా కథ చెప్దామని వెళ్తే కథ వినే ముందు ఇంతకుముందు ఎక్కడైనా పని చేసిన అనుభవం ఉందా అనిమర్యాదగా అడుగుతారు. నేను ఫలానా డైరెక్టర్‌ దగ్గర పని చేశానని చెప్పగానే అంతే మర్యాదగా పొమ్మంటారు. అదీ వరుస.
అలా ఓ సంవత్సరం గడిచింది. ఇక లాభం లేదనుకుని తట్టా బుట్టా సర్దేసుకుని ఇంటికెళ్లిపోదాం అనుకుంటుండగా, మూడు నెలలుగా రెంటు కట్టని నా ఇంటి తలుపు తట్టిందో అవకాశం. మా ఫ్రెండు వాళ్ల అన్నయ్య ఒకతను చాలా కష్టపడి తనకు తెలిసిన ప్రొడ్యూసర్‌ ఒకాయన్ని నా కథ వినడానికి ఒప్పించాడు.
ఇప్పుడు నేను కథ చెప్పడానికి వెళ్తోంది ఆ పెద్దమనిషికే. ఆయనేమో సాయంత్రం 6 గంటలకు షార్ప్‌గా మధురానగర్‌లోని తన గెస్టు హౌస్‌కి వచ్చేయమన్నాడు. నాకేమో లేటైపోయింది. సరే ఇప్పుడు టైం ఎంతయ్యిందో చూద్దామని నా ప్యాంటు జేబులో పెట్టుకున్న సెల్‌ బయటికి తీయబోతుంటే ఉన్నట్టుండి అది మోగింది. చూస్తే నాకు అప్పాయింట్‌ మెంట్‌ అరేంజ్‌ చేసినతను కాల్‌ చేస్తున్నాడు.
కాల్‌ లిఫ్ట్‌ చేసి,
'హలో అన్నా... చెప్పండి.' అన్నాను.
'ఎక్కడున్నావ్‌ తమ్ముడూ... రీచ్‌ అయ్యావా?'
'లేదన్నా దారిలో నా బైక్‌ చెడిపోయింది. అందుకే కొంచెం లేటయ్యింది. ఇప్పుడు మెట్రోలో ఉన్నా. ఇంకో పది నిమిషాల్లో అక్కడుంటా.' అని చెప్పి టైం చూశాను. 05:45:40 అయ్యింది.
'ఏంటి తమ్ముడూ? ఇంకా వెళ్లలేదా! తొందరగా వెళ్లు. అసలే ఆ ప్రొడ్యూసర్‌ చాలా స్ట్రిక్ట్‌. కామన్‌ సెన్స్‌ లేకపోయినా సహిస్తాడేమో కానీ, టైం సెన్స్‌ లేకపోతే అస్సలు సహించడు. అదీ కాక ఇప్పుడు మిస్సయితే మళ్లీ సంవత్సరం వరకూ ఆయన్ని కలవడం కష్టం. తర్వాత నీ ఇష్టం. ఆల్‌ ది బెస్ట్‌ మరి.'
అంటూనే కాల్‌ కట్టయ్యింది.
ట్రైన్‌ జూబ్లీ హిల్స్‌ రోడ్‌ నంబర్‌ ఫైవ్‌ స్టేషన్లో ఆగింది.
అక్కడ ఇంకొంత మంది ఎక్కారు.
మళ్లీ ట్రైన్‌ కదిలింది.
ఓ రెండు నిమిషాలకి యూసఫ్‌గూఢ వచ్చింది. అక్కడ జనం ఎక్కువగా లేరు. ఓ ఇద్దరమ్మాయిలు తప్ప. వాళ్లిద్దరూ నేనున్న భోగీలోకే అటు చివర ఉన్న డోరులోంచి లోపలికి ఎక్కారు. ఇద్దరూ బావున్నారు. కానీ ఆ ఇద్దరిలో ఎరుపు రంగు చుడీదార్‌ వేసుకున్న అమ్మాయి మాత్రం అచ్చు చిన్నప్పటి నుంచీ నా కలల్లోకి వచ్చి కవ్వించే నా డ్రీమ్‌గర్ల్‌, అదేనండీ కలలరాణి అంటారు కదా అలా ఉంది.
చక్కటి నుదురు,
చేపల్లాంటి కళ్లు,
చెక్కినట్టున్న ముక్కు,
చెర్రీల్లాంటి పెదాలు.
అన్నింటినీ మించి తన అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తూ చుబుకపు చివరంచునొక చిన్న మచ్చ.
చూస్తుంటే ఎవరో దేవకన్య దారి తప్పి మెట్రో ఎక్కినట్టనిపించింది.
ఎవరో నా గుండెని పట్టుకుని గట్టిగా నొక్కినట్టనిపించింది.
ఒళ్లంతా మన్మధ బాణాలు గుచ్చుకున్నాయి.
ఊహలు పెళ్లి దాకా వెళ్లిపోయాయి.
మళ్లీ చిన్న కుదుపుతో ట్రైన్‌ కదిలే వరకూ నాకు గుర్తు రాలేదు. నేను దిగాల్సింది నెక్స్ట్‌ స్టేషన్‌ మధురానగర్లోనే అన్న విషయం గుర్తుకువచ్చింది. యూసుఫ్‌గూఢ నుంచి మధురా నగర్‌కి దాదాపుగా మూడు నిమిషాలు ప్రయాణం. ఈ మూడు నిమిషాల్లో తనతో మాట్లాడటం కుదరదు కాబట్టి అంతసేపు కనీసం తనని చూస్తూ నేత్రానందాన్నైనా పొందుదామనుకుని, అటు చివర డోర్‌ దగ్గర నిలబడున్న తన వైపే తదేకంగా చూడడం మొదలు పెట్టాను.
అర నిముషం గడిచింది.
తను నా వైపు ఒక్కసారైనా చూస్తే బాగుండుననిపించింది. అలా అనుకున్నానో లేదో ఎవరో దేవుడు తథాస్తు అన్నాడనుకుంటా. కలయో, దైవ మాయో అన్నట్టుగా తను నా వైపు చూసింది. చూసింది చూసినట్టు ఉండక ఓ చిరునవ్వు విసిరింది. దాంతో నా మనసనే గాలిపటానికి కట్టిన దారం పుటుక్కున తెగిపోయింది.
కొంతసేపు ఇద్దరం ఒకరినొకరం ఆరాధనగా చూసుకున్నాం. కాసేపటికి తను ఏంటన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది. నేను ఏమీ లేదన్నట్టు తలూపాను. తను పలువరుస కనిపించేట్టు అందంగా నవ్వింది. బదులుగా నేనూ నవ్వాను. అలా నవ్వుతుండగానే తను నాకు కనిపించకుండా ఇద్దరి మధ్యలో అడ్డంగా ఓ ముసలతను వచ్చి నిలబడ్డాడు.
'డామిట్‌.' అనుకుని వెంటనే టైం చూశాను.
05:50:11 గంటలు అయ్యింది. మధురానగర్‌ రావడానికి ఇంకా రెండు నిమిషాలే ఉంది. ఏదో ఒకటి చేసి తనతో ఎలాగైనా మాట్లాడాలనుకున్నాను. ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి అందరినీ దాటుకుంటూ ఓ రెండడుగులు ముందుకేయగానే, ఎదురుగా ఓ భారీ ఆకారం నాకు అడ్డొచ్చింది. అతన్ని చూస్తే బ్రహ్మ రాక్షసుడెవడో మానవ రూపం దాల్చి ట్రైన్లోకి ప్రవేశించినట్టు అనిపించింది. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్‌లో పెట్టే వినాయకుడి విగ్రహంలా ఎత్తుగా, దిట్టంగా ఉన్నాడతను. అతనికి ఇరు వైపులా ఇద్దరు మనుషులు గానుగలో పడ్డ వేరుశెనగ గింజల్లా నలిగిపోతున్నారు.
నేను జంకుతూనే వెనుక నుంచి అతని భుజం మీద ఓసారి తట్టాను. అతను వెనక్కి తిరిగి 'ఏం?' అన్నట్టు చూశాడు.
'కొంచెం సైడు ఇస్తే ముందుకెళ్తాను' అన్నాను.
'ఇక్కడ నిలబడడానికే చోటు లేదు. నువ్వెక్కడికి పరిగెడుతున్నావ్‌.' అని కర్ణ కఠోరమైన స్వరంతో అన్నాడతను.
'అది కాదు. కొంచెం అర్జెంట్‌. అర్థం చేసుకోండి ప్లీజ్‌' అన్నాను మళ్లీ ప్రాధేయపడుతూ.
అతను ఈసారి తల వెనక్కి తిప్పకుండానే 'వెళ్లు.' అంటూ తన ఎడమ చేతిని పైకెత్తాడు.
ఆ ఎత్తిన చేతికీ, తన శరీరానికీ మధ్య ఓ బిలం లాంటిది ఒకటి ఏర్పడింది. ఆ సందులో దూరి ముందుకెళ్లే సరికి నా బొందిలో ప్రాణం పోయినట్టనిపించింది. సరే పోలేదు కదా అనుకుని ఓ అడుగు ముందుకేసి చూస్తే ఎదురుగా కనిపించిందో ఆడవాళ్ల గుంపు.
వాళ్లని చూడగానే అప్పటిదాకా ఆ అమ్మాయిని కలుస్తానని నాలో కొట్టుమిట్టాడుతున్న నమ్మకం కాస్తా పూర్తిగా సడలిపోయింది. ఎందుకంటే వాళ్లను దాటుకుని వెళ్లడం అసాధ్యం. ఒకవేళ తెగించి దాటాలనుకున్నానే అనుకో. అలా ఆ ఆడాళ్ల మధ్యలోంచి వెళ్తున్నప్పుడు పొరపాటున నా చెయ్యో, కాలో వాళ్లకి తగిలితే ఇక అంతే సంగతులు. తలో చెయ్యీ వేసి నా వీపును తబలా వాయించినట్టు వాయించేస్తారు. అక్కడితో ఆగకుండా ఆ గొడవనంతా ఎవడో ఒకడు వీడియో తీసి నెట్లో పెట్టేస్తాడు. అంతటితో నా కెరీర్‌కి ఫుల్‌స్టాప్‌ ఖాయం. అసలే డైరెక్టర్‌ అవ్వాల్సిన వాడిని మళ్లీ ఈ గోలంతా నాకెందుకు అనుకుని, ఇంకో ఉపాయం కోసం ఆలోచిస్తుంటే మెల్లగా నా మోకాలి మీదెవరో గోకారు. కిందికి చూస్తే ఓ ఏడేళ్ల పాప టెడ్డీ బేర్‌ చేతిలో పట్టుకుని, ఏడుపు మొహంతో నిలబడి ఉంది.
'ఏంటమ్మా?' అన్నాను తనని ముద్దు చేస్తూ.
తను 'అమ్మ దగ్గరికి వెళ్లాలి.' అంటూ ఆ ఆడవాళ్ల గుంపుకి అవతల నిలబడి ఉన్న వాళ్లమ్మని చూపించింది. వెంటనే నాకో అద్భుతమైన ఆలోచన వచ్చింది. గబగబా ఆ పాపని ఎత్తుకుని ఆ గుంపు దగ్గరికెళ్లి 'ఈ పాప వాళ్లమ్మ దగ్గరికి వెళ్లాలంట. ఏడుస్తోంది. కొంచెం తప్పుకుంటారా?' అని రిక్వెస్ట్‌ చేస్తూ వాళ్లందరినీ దాటేశాను. తర్వాత పాపని వాళ్లమ్మ దగ్గర వదిలేసి, ఆ అమ్మాయి వైపు చూశాను. తను డోర్‌కి అభిముఖంగా నిలబడుకుని, బయటకు చూస్తూ తన ఫ్రెండ్‌తో ఏదో మాట్లాడుతోంది. నేను ఇప్పుడు తన వెనుక సరిగ్గా బారెడు దూరంలో నిలబడి ఉన్నాను. సూర్యుడిని సమీపించే కొద్దీ తోక చుక్కకు తోక పెరిగినట్టు, నేను తనకు దగ్గరయ్యే కొద్దీ నాకు టెన్షన్‌ పెరిగిపోతోంది. ఒకసారి టైం ఎంతయ్యిందో చూద్దామని నా సెల్‌ ఫోన్‌ బయటకు తీసి లాక్‌ బటన్‌ నొక్కాను.
05:51:28 గంటలు అయ్యింది. ఇంకా ముఫ్ఫై సెకన్లే ఉన్నాయి. తర్వాత నేను దిగిపోవాలి. కావున త్వరపడ్డాను. ఇంకొంచెం ముందుకెళ్లి తన వెనుక నిలబడ్డాను. మాట్లాడదామని వచ్చేశాను కానీ తీరా దగ్గరికెళ్లాక ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కాలేదు. ముందు నన్ను నేను పరిచయం చేసుకోవాలా? లేకపోతే అంత టైం లేదు కాబట్టి డైరెక్టుగా తన పేరూ, సెల్‌ నంబర్‌ అడిగేస్తే. నాకంతా తికమకగా ఉంది. కానీ ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే స్టేషన్‌ వచ్చేస్తుంది. ఏదో ఒకటి మాట్లాడాలి తప్పదు అనుకుని తనను పలకరించడానికి 'ఎక్స్యూజ్‌ మీ.' అనబోయేంతలో...
'నెక్స్ట్‌ స్టేషన్‌ మధురానగర్‌. డోర్స్‌ విల్‌ ఓపెన్‌ ఆన్‌ ది లెఫ్ట్‌' అని అనౌన్సుమెంటు వచ్చేసింది.
నేను దిగాల్సిన చోటే కాదు.
నా ప్రేమకథకూ ముగింపు దగ్గరికొచ్చేసింది.
చిన్నప్పటి నుంచీ చెప్పాలనుకుని చెప్పలేక, చెప్పడానికి పరిస్థితులు అనుకూలించక ఆదిలోనే అంతమైన నా ప్రేమ కథల్లో ఇది కూడా ఒకటి కాబోతోంది.
నో... అలా కాకూడదు. ఆరు నూరైనా సరే దీన్ని సఫలీకృతం చేసుకోవాలని దృఢంగా మనసులో సంకల్పించుకుని, మళ్లీ 'ఎక్స్యూజ్‌ మీ.' అంటుంటే...
'అగ్లా స్టేషన్‌ మధురానగర్‌. దర్వాజే బాయీం తరఫ్‌ మే కోలుంగీ' ఈసారి కూడా అదే అనౌన్సుమెంటు హిందీలో.
నాకు ఒక్కసారిగా ట్రైన్‌లోని స్పీకర్లన్నీ పగలకొట్టేయాలి అన్నంత కోపం వచ్చింది. దాన్ని బలవంతానా అణుచుకుని, ఇంకోసారి తెలుగులో అనౌన్సుమెంట్‌ వచ్చేలోపు 'ఎక్స్యూజ్‌ మీ' అని పిలిచాను. నిజం చెప్పాలంటే అరిచాను.
వినబడిందనుకుంటా ఆ అమ్మాయి మెల్లగా వెనక్కి తిరిగి, సడనుగా నన్నక్కడ చూసినందుకు ఆశ్చర్యపోతూ, 'ఏంటండీ?' అంది. అలా అన్నాక తన చిరునవ్వుని, సిగ్గుని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ నా కళ్లలోకే చూడసాగింది.
నేను ఆ దిక్కుమాలిన తెలుగు అనౌన్సుమెంట్‌ వెళ్లిపోయేదాకా ఆగి, 'ఏం లేదండీ... అదీ... మీ పేరు ఆకాష్‌ అండీ...' అన్నాను కన్ఫ్యూజ్‌ అయ్యి కంగారులో.
'వాట్‌?' అంది తను, అర్థంకానట్టు మొహం పెట్టి.
'ఛ...సారీ. మీ పేరు కాదండీ. నా పేరు ఆకాష్‌ అండీ. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నానండీ...' అంటూ చెబుతుంటే, నా మాటలకు సమాంతరంగా ట్రైన్‌ ఆగడం, లోపలున్న జనం దిగడానికి నన్ను వెనక్కి నెట్టేసి ముందుకెళ్లిపోవడం ఒకేసారి జరిగాయి.
పాపం తను నేను చెప్పేది వినాలనో, లేకపోతే తనేదో చెప్పాలనో డోర్‌ దగ్గరే నిలబడి ఉంది. ఈతరాని వాడిని చెరువు మధ్యలో వదిలేస్తే ఒడ్డుకు చేరడానికి వాడెలా గింజుకుంటాడో, అలాగే నేను కూడా తనను చేరడానికి జన ప్రవాహాన్ని ఈదుతూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. అయినా నా వల్ల కావట్లేదు. పోనీ అందరూ దిగేంత వరకూ వెయిట్‌ చేసి తర్వాత వెళ్లి మాట్లాడుదామా అంటే నేనూ అదే చోట దిగిపోవాలి. దిగిపోతే మాట్లాడటం కుదరదు. ఎలా?
ఇప్పుడు నా ముందు రెండు ఆప్షన్స్‌ ఉన్నాయి. ఒకటి, దిగి వెళ్లి ప్రొడ్యూసర్‌కి కథ చెప్పడం. రెండు, దిగకుండా అమ్మాయికి ఐ లవ్‌ యు చెప్పడం. మొదటిది జీవనోపాధి. రెండోది జీవిత భాగస్వామి. ఏదైనా ఒకటే ఎంచుకోవాలి. ఎంచేసుకున్నాను. జీవిత భాగస్వామి ఆప్షన్‌ మీద క్లిక్‌ చేసేశాను. ఈ ప్రొడ్యూసర్‌ కాకపోతే ఇంకో ప్రొడ్యూసర్‌ రేపైనా దొరుకుతాడు. కానీ తను మిస్సయితే మళ్లీ అలాంటి అమ్మాయి దొరకడం అసంభవం.
అందుకే అందరూ దిగిపోయే వరకూ ఎదురు చూశాను. తర్వాత కొంచెం రిలాక్స్డ్‌గా తన దగ్గరికెళ్లి, 'మీ పేరు...' అనబోతుంటే, అప్పటిదాకా తన పక్కనే నిలబడి సైలెంట్‌గా ఉన్న తన ఫ్రెండ్‌ 'ఎంతసేపే? అందరూ దిగేశారు. ట్రైన్‌ కదిలేలా ఉంది దిగూ' అంటూ తనని చెయ్యి పట్టుకుని లాగి, కిందికి దింపేసింది.
ఏం జరిగిందో నాకు ఒక్క క్షణం అర్థం కాలేదు. 'అంటే వీళ్లూ ఈ స్టేషన్‌లోనే దిగాలన్నమాట. అయితే నేనూ ఇక్కడే దిగేసి తనకు ప్రేమ విషయం చెప్పేసి, అటు నుంచి అటే వెళ్లి ప్రొడ్యూసర్‌కి కథ చెప్పేయొచ్చన్న మాట.'
యాహూ అని అరవాలనిపించింది, నాకు ఆ సంగతి తట్టగానే.
ఆ ఆనందాన్ని అతికష్టం మీద కంట్రోల్‌ చేసుకుని, మైసూరు మహారాజులా హుందాగా కిందికి దిగడానికి కుడి కాలు ముందుకు కదపబోతుండగా...
ఏ మంత్రం వెయ్యకుండానే నా ముందున్న తలుపులు చప్పున మూసుకుపోయాయి.
దిగ్భ్రాంతితో నా నోరు దానంతటదే తెరుచుకుపోయింది.
ఏం చెయ్యాలో తోచక మెదడు మొద్దుబారి, మొద్దులా నిలబడ్డ నా దేహాన్ని మోసుకుంటూ ట్రైన్‌ 35 కిలోమీటర్ల వేగంతో అమీర్‌పేట వైపు దూసుకుపోతూ ఉంటే, నన్నెవరో కాంతి వేగంతో విశ్వంలోకి విసిరేసినట్టు అనిపించింది.
ఇంతలో ఆకాశవాణి పలికినట్టు చిన్నప్పుడు మా ఇంగ్లీష్‌ మేడమ్‌ చెప్పిన
'టైమ్‌ ఈజ్‌ ప్రీషియస్‌...
టైమ్‌ ఈజ్‌ మనీ...
యూ కాంట్‌ రివర్స్‌ ది టైమ్‌ దట్‌ యు వేస్టెడ్‌...'
అనే మాటలు లీలగా ఎక్కడ్నించో వినిపించసాగాయి. వాటికి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లా నేను ఫోన్‌లో ఆరు గంటలకు పెట్టుకున్న అలారం ఉచ్చస్థాయిలో మోగసాగింది.

వెంకట్‌ ఈశ్వర్‌
78930 78164