పండుటాకు రాలింది
ఎండినాకు నవ్వింది
పునాదుల్లేని బతుకు గోడలు
రంగుల్ని పులుముకున్నాయి
వేర్లు లేని వృక్ష సమూహాలు
ప్రకృతిని శాసించాయి
అన్నీ దాపరికాల నడుమ
ఒక వ్యవస్థ నిర్మాణమైంది
గుండె లేని హృదయంలో
కొన్ని దయాదాక్షిణ్యాలు
పురివిప్పి ఆడుతున్నాయి
అడుగు అడుగునా ఒక వలయం
కాలం కాని కాలంలో
అతుకుల బట్టకు
రంగు రంగుల మరమ్మతులు
జోరుగా సాగుతున్నాయి
కాళ్లు లేని కుర్చీకై
తలకాయ లేని మేధావితనం
అలుపెరుగని పోరాటం చేస్తోంది
నాలుక లేని వాగ్ధానపు నోటిలో
కోకొల్లలుగా మాటల తూటాలు
రయ్యిన దూసుకెళ్తున్నాయి
గులకరాళ్ల పంట చేనులో
అలకబూనిన రైతుని చూసి
ధరలు ఫక్కున నవ్వుకున్నాయి
పేరు లేని వంటకాల గదులు
రుచి ఎరుగని కడుపుకు
అమృత భాండాలైనాయి
బూతు సమావేశపు ఆవేశంలో
ఆవిరౌతున్న నిజస్వరూపాలు
శూన్యంలో కలిసిపోతున్నాయి
కాలం కాని కాలం ఒడిలో
పేద గాయాలకు జోలపాడి
నొప్పిని మరిపించే సూత్రాలు
వందల్లో విస్తరిస్తున్నాయి
అవకతవకల తీర్మానపు కొమ్మకు
ధర్మాధర్మాలు గబ్బిలాలై
వేలాడుతూనే వున్నాయి
కాలం మనిషిని మార్చలేదు
మనిషే కాలాన్ని మార్చేస్తున్నాడు
నరెద్దుల రాజారెడ్డి
96660 16636