Oct 01,2023 20:34

డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ జిఆర్‌ రవీంధ్రనాధ్‌

ప్రజాశక్తి-విజయనగరం కోట :  జిల్లాలో కాలం చెల్లిన వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ జిఆర్‌ రవీంధ్రనాధ్‌ తెలిపారు. ప్రైవేటు టాక్సీ బోర్డు వాహనాలకు వాహన చట్టం ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి వాహన సామర్ధ్య పరీక్ష నిర్వహించి వాహనం నడిపేందుకు అనుమతి జారీ చేస్తున్నామని చెప్పారు. ఫిట్‌నెస్‌లేకుండా పాఠశాల బస్సులు తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖి ఇంటర్వ్యూలో పలు విషయాలను వివరించారు.
- జిల్లాలో ఎన్ని వాహనాలు ఉన్నాయి?
జిల్లాలో మొత్తంగా అన్ని రకాల వాహనాలు కలిపి 3లక్షల 95వేల 664 వాహనాలు ఉన్నాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు 3,57,883, త్రిచక్ర వాహనాలు 8780, ఫోర్‌వీలర్స్‌ వాహనాలు (కార్లు, బస్సులు, లారీలు) 29,001 ఉన్నాయి.
- జిల్లాలో బడి బస్సులెన్ని? ఏటా ఫిట్‌నెస్‌ ఉంటేనే రెన్యువల్‌ చేస్తున్నారా?
జిల్లాలో మొత్తంగా ప్రైవేటు స్కూళ్లకు సంబంధించిన బస్సులు 440 ఉన్నాయి. వాటిలో ఈ ఏడాది 356 బస్సులు రెన్యువల్‌ అయ్యాయి. అన్ని విధాలా బస్సులు ఫిట్‌ అయితేనే రెన్యువల్‌ చేస్తున్నాం. ఏవైనా బస్సులు రెన్యువల్‌ కాకుండా తిరుగుతున్నట్లు తమకు సమాచారం ఉంటే సీజ్‌ చేయడంతో పాటు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం.
- డ్రైవింగ్‌ లైసెన్సింగ్‌ విధానాలో వచ్చిన మార్పులు గురించి వివరించండి?
లైసెన్సింగ్‌ జారీ ప్రక్రియంతా వాహన సారధి వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే జరుగుతోంది. ఇది నేషనల్‌ సర్వర్‌. కార్డులు జారీ ప్రక్రియ నిలిచిపోయింది. అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత గతంలో మాదిరి కార్డుల ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం నిలిచిపోయింది. అంతా ఆన్‌లైన్‌లోనే మంజూరు జరుగుతోంది. డిజి లాకర్‌ యాప్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
- కాలం చెల్లిన వాహనాల రెన్యువల్‌కు అనుసరిస్తున్న పద్దతి ఏమిటి?
ప్రభుత్వ వాహనాలకు 15ఏళ్లు నిండిన తరువాత రెన్యువల్‌కు అనుమతి లేదు. అలాంటి వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్‌ చేయడం జరుగుతుంది. ప్రైవేటు టాక్సీ బోర్డు వాహనాలకు వాహన చట్టం ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి వాహన సామర్ధ్య పరీక్ష నిర్వహించి వాహనం నడిపేందుకు అనుమతి జారీ చేస్తున్నాం.
- అధికలోడుతో ప్రయాణిస్తున్న వాహనాలకు ఏ విధంగా చలానా వేస్తున్నారు?
అధికలోడుతో ప్రయాణిస్తున్న వాహనాలకు ప్రభుత్వం చలానా రూ.20వేలు విధిస్తున్నాం. ప్రయాదాలు జరగకుండా నివారిస్తున్నాం.
- రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల వద్ద ఏజెంట్ల వ్యవస్థ పెచ్చుమీరుతోంది. నివారణకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
లైసెన్సు ప్రక్రియంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లైసెన్సులు జారీ చేస్తున్నాం. ఏజెంట్ల వ్యవస్థను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నాం.
- రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు?
వర్షాకాలంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బి శాఖ అధికారులతో మాట్లాడి రోడ్ల మరమ్మతుల గురించి చర్చలు జరుపుతున్నాం.
- సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌చేసే వారికి రూ.2వేలు జరిమానా విధిస్తున్నాం. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
- నెంబరు ప్లేట్లు లేకుండా, ఉన్నా సరిగా అంకెలు లేకపోవడం జరుగుతోంది. వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
నెంబరు ప్లేట్లు లేని వాహనాలకు రూ.2వేలు జరిమానా విధిస్తున్నాం. నెంబరు ప్లేట్‌ వినియోగించి గురించి అవగాహన కల్పిస్తున్నాం. పోలీసుశాఖతో సమన్వయం చేసుకుంటూ నెంబరు ప్లేట్లు సరిగా లేని వాహనాలను తనిఖీ చేసి జిరిమానా విధిస్తున్నాం.
- డ్రైవింగ్‌ స్కూల్స్‌కు ఇటీవల నోటీసులు ఇచ్చారు. వారినుంచి స్పందన ఏమిటి?
నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్‌ స్కూల్స్‌ నడుపుతున్న యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశాం. ఇప్పటికే చాలా డ్రైవింగ్‌ స్కూల్స్‌ యజమానులు తమ లోపాలను సరి చేసుకున్నారు. ఇంతవరకు ఎవరి లైసెన్సును రద్దు చేయలేదు.