ప్రజాశక్తి-పంగులూరు: గత సంవత్సరం సాగుకు ఉపయోగించవలసిన మినుము విత్తనాలను, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఈ సంవత్సరం ఇచ్చి రైతాంగాన్ని మోసం చేయాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ విత్తనాలు మాకొద్దని రైతాంగం నుంచి వ్యతిరేకత రావటంతో, చేసేది లేక, విత్తనాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం సాగు చేయాల్సిన మినుము విత్తనాలను, ఆ రాష్ట్రానికి చెందిన తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, ఇక్కడ రైతులకు అందజేసే ప్రయత్నం చేసింది. అయితే పంగులూరు మండలంలో రైతులకు అమ్మిన మినుము విత్తనాలను చూసి 'ప్రభుత్వమే రైతులను ముంచింది' అనే శీర్షికతో ప్రజాశక్తి వార్త ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ విత్తనాలు 9 నెలలు మాత్రమే సాగు చేయాలి. తరువాత సాగు చేసినా ఫలితం ఉండదు. అలాంటి విత్తనాలను మరో తొమ్మిది నెలలు గడిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి రైతాంగానికి ఇస్తోంది. దీంతో పాటు ధర కూడా రెట్టింపు చేసి అమ్ముతున్నారు. ఈ విత్తనాలను సాగు చేస్తే మొలకశాతం తగ్గిపోయి, దిగుబడులు కూడా భారీగా తగ్గిపోతాయని చెబుతున్నారు. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు ఆ విత్తనాలను రైతులకు ఇవ్వవద్దని, వాటిని మొత్తాన్ని వెనక్కి తరలించాలని కింది స్థాయి ఉద్యోగులను ఆదేశించారు. దీంతో మండలంలోని బయటమంజులూరు, ముప్పవరం, పంగులూరు- 1, తూర్పు కొప్పెరపాడు, రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేసిన 27 క్వింటాళ్ల 48 కేజీల మినుము విత్తనాలను గుంటూరులోని ఏపీ సీడ్స్ కార్యాలయానికి తరలించారు. రైతులు ఎవరికీ తాము మినుము విత్తనాలను సరఫరా చేయలేదని, అందువలన ముప్పవరం రైతు భరోసా కేంద్రం పరిధిలో ఇబ్బంది ఏమీ లేదని, తమకిచ్చిన ఐదు క్వింటాళ్ల మినుము విత్తనాలను వెనక్కు పంపుతున్నామని ముప్పవరం రైతు భరోసా కేంద్రం ఇన్‌ఛార్జి దినేష్ తెలిపారు. ఏదిఏమైనా మోసాలను అరికట్టాల్సిన ప్రభుత్వమే రైతాంగాన్ని మోసం చేయాలని ప్రయత్నించడం పట్ల రైతుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.










