ప్రజాశక్తి - కాళ్ల
కాళ్లకూరు గ్రామంలో పద్మావతి తాగునీటి చెరువులో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు నెలల క్రితం ఏర్పాటు చేసిన రెండు శిలాఫలకాలను శుక్రవారం వైసిపిలో ఒక గ్రూపునకు చెందిన నేతలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో దాట్ల వెంకట రామరాజు ఆధ్వర్యంలో కాళ్లకూరు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. పద్మావతి తాగునీటి చెరువులో రేవులు శిథిలావస్థకు చేరాయి. చెరువులో పూడికతీత పనులను చేపట్టడమే కాకుండా మూడు రేవులు, రిటైనింగ్ వాల్‌ను రూ.13 లక్షలతో నిర్మించారు. వాటిని పివిఎల్.నరసింహరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఈ ప్రారంభత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను వైసిపిలో ఒక గ్రూపునకు చెందిన నేతలు ధ్వంసం చేయడంతో వాటిని పంచాయతీ కార్యాలయంలో ఉంచారు. వైసిపి ప్రజాప్రతినిధులే ఈ చర్యకు పాల్పడడం దారుణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎన్ని అరాచకాలు చేసినా కాళ్లకూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న దాట్ల వెంకటరామరాజును, ఆయన చేసిన అభివృద్ధి పనులను చెరపలేరని తెలిపారు. రెండు శిలాఫలకాలు, ఆర్చ్‌ను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శిలాఫలకాలు ధ్వంసం చేయడం దుర్మార్గమని శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ అధినేత దాట్ల వెంకట రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ఉద్దేశంతో కాళ్లకూరులో ట్రస్ట్ ద్వారా రూ.70 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పంచాయతీ నుంచి బిల్లులు చేసుకునేందుకు శిలాఫలకాలను ధ్వంసం చేశారని తెలిపారు. దాతలను భయపెట్టేలా కొంతమంది వైసిపి నాయకులు వ్యవహరించడం సరికాదన్నారు. దీనిపై పంచాయతీ గ్రామ కార్యదర్శి జి.సునీల్ రాజును వివరణ వివరణ కోరగా పద్మావతి చెరువు వద్ద శిలాఫలకాలు, ఆర్చి ధ్వంసం చేయడం తనకు తెలీదని తెలిపారు. చెరువు తవ్వకానికి, రేవుల నిర్మించడానికి అనుమతులు ఇచ్చామని, ఒక శిలాఫలకం ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చామని తెలిపారు. రెండో శిలాఫలకం, ఆర్చ్‌ను ఏర్పాటు చేసేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. తాగునీటి చెరువు పంచాయతీ పరిధిలో ఉన్నప్పటికీ ఆ చెరువును వెంకటేశ్వరస్వామి దేవస్థానం వారు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. మూడు నెలల క్రితం శిలాఫలకాలు, ఆర్చ్‌ను తొలగించాలని దాట్ల వెంకటరామరాజుకు నోటీసులిచ్చామని తెలిపారు.